Green Leaves | ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది ఇళ్లలో వండకోవడమే మానేస్తున్నారు. బయట ఆహారాన్నే ఎక్కువగా తింటున్నారు. చేతిలో ఫోన్ ఉంటుంది కనుక ఆఫీస్‌లో లేదా ఇతర ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆన్లైన్లోనే ఫుడ్‌ను ఆర్డర్ చేసి తమకు ఇష్టమైన వంటకాలను రుచి చూస్తున్నారు. అయితే బయటి ఫుడ్‌ను ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు. కానీ చాలా మంది రోజూ బయటి ఫుడ్‌నే తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇక చాలా మంది ఆకుకూరలను కూడా తినడం లేదు. మనకు అందుబాటులో అనేక రకాల ఆకుకూరలు లభిస్తున్నాయి. ఆకుకూరలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని, వీటిని తరచూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలను తరచూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మెంతి ఆకు కూడా ఒకటి. ఈ ఆకుల్లో విటమిన్లు ఎ, సిలతోపాటు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. మెంతి ఆకులను తినడం వల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. మెంతి ఆకులతో నేరుగా కూర చేయవచ్చు. లేదా మీరు తినే ఆహారంలో కలిపి తినవచ్చు. అలాగే కొత్తిమీర కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకుల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, సిలతోపాటు విటమిన్ కె కూడా మనకు కొత్తిమీర ద్వారా లభిస్తుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం అవకుండా ఆపవచ్చు. దీన్ని కూడా నేరుగా తినవచ్చు లేదా కూరల్లో వేసి కూడా తినవచ్చు.
మునగాకులను చాలా మంది తినరు. కానీ వీటితోనూ కూర లేదా పప్పు, పచ్చడి వంటివి చేసుకుని తినవచ్చు. లేదా మునగాకుల రసాన్ని తాగవచ్చు. మునగాకులను పోషకాలకు నెలవుగా చెబుతారు. ఈ ఆకుల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తరచూ మునగాకులను తింటుంటే రోగాల బారిన పడకుండా ఉంటారు. అలాగే గంగవల్లి ఆకులను కూడా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ ఆకులతో పప్పు చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. టమాటాలు వేసి కూడా తినవచ్చు. ఈ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఈ ఆకులను కూడా తరచూ తింటుండాలి.
తోటకూరను చాలా మంది తినేందుకు అంత ఆసక్తిని ప్రదర్శించరు. కానీ తోటకూర మనకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. తోటకూరలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. తోటకూరను చాలా మంది పప్పులో వేస్తారు. తోటకూరను నేరుగా కూడా కూరగా చేసి తినవచ్చు. లేదా రసం తాగవచ్చు. గుమ్మడికాయ ఆకులు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ ఆకులను ఎవరూ తినరు. కానీ ఈ ఆకుల నుంచి రసం తీసి తాగవచ్చు. ఇందులోనూ అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి వ్యాధుల నుంచి మనల్ని బయట పడేస్తాయి. ఇలా పలు రకాల ఆకుకూరలను తరచూ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాల పోషకాలు కూడా లభిస్తాయి.