Fruits For Weight Loss | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సరైన సమయానికి ఆహారం తినడం, వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, సరైన డైట్‌ను పాటించడం వంటివి చేస్తుంటారు. అయితే బరువును తగ్గించడంలో మనం తినే ఆహారం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలో భాగంగా పలు రకాల పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి పోషకాలను అందించడమే కాదు మన శరీరానికి శక్తి వచ్చేలా చేస్తాయి. అలాగే అధిక బరువును తగ్గిస్తాయి. మీరు గనక బరువు తగ్గించుకోవాలనుకునే ప్రణాళికలో ఉంటే కచ్చితంగా ఈ పండ్లను డైట్లో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్ల వల్ల బరువును త్వరగా తగ్గించుకునేందుకు వీలుంటుందని అంటున్నారు.
యాపిల్ పండ్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి ఫేవరెట్ పండ్లుగా ఉన్నాయి. ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువే. అందువల్ల యాపిల్ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ బీపీ, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలోని కొవ్వు కరిగేలా చేస్తాయి.
నారింజ పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది మెటబాలిజం పెరిగేందుకు దోహదం చేస్తుంది. తరచూ నారింజ పండ్లను తింటుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. పుచ్చకాయలు, ఖర్బూజాల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. క్యాలరీలు కూడా వీటిల్లో తక్కువగానే ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
దానిమ్మ పండ్లలో పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువు తగ్గేందుకు ఎంతో సహాయం చేస్తాయి. దానిమ్మ పండ్లలో ఆంథో సయనిన్స్, టానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లను రోజూ తింటుంటే బరువును తేలిగ్గా తగ్గిచుకోవచ్చు. అధిక బరువు తగ్గేందుకు బొప్పాయి పండు కూడా మేలు చేస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బొప్పాయి పండ్లలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా పలు రకాల పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే దీంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.