Foods For Younger Skin | మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన చర్మం అనేక మార్పులకు లోనవుతుంది. వయస్సు మీద పడే కొద్దీ చర్మంలో ముడతలు పెరిగిపోతాయి. అయితే మనం తినే ఆహారం, ఒత్తిడి, కాలుష్యం, పలు ఇతర కారణాల వల్ల కూడా చర్మం త్వరగా ముడతలు పడుతుంది. కానీ సినిమా తారలు మాత్రం ఎప్పుడు చూసినా ఒకేలాంటి అందంతో కనిపిస్తారు. వారి వయస్సు అసలు పెరుగుతున్నట్లు కనిపించరు. ఇక హీరోలు అయితే 50 ఏళ్లు వచ్చినా కూడా యువకులలాగే కనిపిస్తుంటారు. సినిమా తారలు పాటించే డైట్‌ను మనం పాటించకపోయినా మనం తీసుకునే ఆహారం విషయంలో మాత్రం కొన్ని మార్పులు చేసుకుంటే అచ్చం వారిలా ఎల్లప్పుడూ యంగ్‌గా కనిపించవచ్చు. మన చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. పాలకూరలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తగ్గేలా చేస్తాయి. పాలకూర జ్యూస్‌ను రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతుంటే ఫలితం ఉంటుంది. పాలకూరలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడుతాయి. చర్మం ఎల్లప్పుడూ మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జా గింజలు కూడా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఒక టీస్పూన్ సబ్జా గింజలను రోజూ నీటిలో నానబెట్టి తింటుండాలి. ఈ గింజల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై ఉండే ముడతలను తగ్గిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.
టమాటాలు కూడా మన చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. టమాటా సూప్‌ను తరచూ తాగాలి. లేదా టమాటా జ్యూస్‌ను రోజూ ఉదయం ఒక కప్పు మోతాదులో తాగాలి. టమాటాలను అడ్డంగా చక్రాల్లా కోసి ముఖంపై రుద్దవచ్చు. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తుంటే చర్మంపై ఉండే ముడతలు పోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మానికి సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. టమాటాలలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. కనుక టమాటాలను ఎలా వాడినా సరే యవ్వనంగా కనిపిస్తారు. చర్మంపై ముడతలు అసలు కనిపించవు.
చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేసే విటమిన్ ఇ బాదంపప్పులో సమృద్ధిగా ఉంటుంది. బాదం పప్పులను రోజూ గుప్పెడు తీసుకుని నీటిలో నానబెట్టి తింటుండాలి. లేదా బాదంనూనెను చర్మానికి రాయవచ్చు. బాదంపప్పులను పేస్ట్‌లా చేసి ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. ఇలా బాదంపప్పులను వాడితే వాటిల్లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం సహజసిద్ధంగా నిగారింపును సొంతం చేసుకుంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. స్ట్రాబెర్రీలు, చెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకునేలా చేస్తాయి. దీంతో కణాలకు ఫ్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. దీని వల్ల ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఇలా పలు ఆహారాలను తీసుకుంటే సినీ తారల్లా ఎప్పుడూ యంగ్‌గా కనిపించవచ్చు.