Foods For Thyroid | మన శరీరంలో ఉన్న గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. ఇది గొంతు మీద సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది అనేక విధులను నిర్వహిస్తుంది. శరీర మెటబాలిజంను, ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. థైరాయిడ్ పనితీరులో అసమతుల్యతలు ఉంటే తద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. మన శరీర మెటబాలిజం, నిర్మాణం, శక్తి స్థాయిలకు అవసరం అయిన అనేక క్రియలను థైరాయిడ్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే శరీరంలో థైరాయిడ్ గ్రంథి పనితీరు కొందరికి మందగిస్తుంది. దీంతో థైరాయిడ్ వచ్చిందని అంటారు. శరీరంలో ఐయోడిన్ స్థాయిలు తగ్గితే థైరాయిడ్ సమస్య వస్తుంది. అందుకనే అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది.
పప్పు దినుసులు, బీన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. వీటిని రోజువారి ఆహారంలో సలాడ్స్ లేదా సూప్స్‌లో తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీరు తినే ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు అయోడైజ్డ్ ఉప్పును తయారు చేస్తున్నాయి. ఉప్పులో కచ్చితంగా అయోడిన్‌ను కలపాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం ఆదేశాలు అమలులో ఉన్నాయి. కనుక అన్ని కంపెనీలు అయోడైజ్డ్ సాల్ట్‌ను మాత్రమే తయారు చేస్తున్నాయి. కాబట్టి మీరు వాడుతున్న ఉప్పు అయోడైజ్డ్ సాల్ట్ అవునా, కాదా.. అన్న విషయాన్ని నిర్దారించుకుని వాడాలి. అయోడిన్ ఉన్న ఉప్పు వాడితే ఈ పోషక పదార్థ లోపం రాకుండా చూసుకోవచ్చు.
పాలు, పాల ఉత్పత్తుల్లోనూ అయోడిన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చీజ్, పెరుగు, పాలలలో అయోడిన్ ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావల్సినంత అయోడిన్ లభిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో అనేక జీవక్రియలు సాఫీగా నిర్వహించబడతాయి. కోడిగుడ్లలోనూ అయోడిన్ అధికంగానే ఉంటుంది. కోడిగుడ్లలో అయోడిన్తోపాటు జింక్, సెలీనియం కూడా అధికంగానే ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తాయి. కోడిగుడ్లను మీరు రోజూ ఉడకబెట్టి తింటే ఎంతో మేలు జరుగుతుంది.
చేపల్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు అయోడిన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. దీని వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. బెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ బెర్రీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. జీవక్రియల వేగం పెరుగుతుంది. థైరాయిడ్ వల్ల వచ్చే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు.