High Blood Pressure | హై బ్లడ్ ప్రెషర్.. దీన్నే హైబీపీ లేదా హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. రక్త నాళాల గోడలపై రక్తం అధిక పీడనాన్ని కలిగిస్తుంది. దీంతో హైబీపీ వస్తుంది. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందికి బీపీ పెరుగుతోంది. అలాగే మద్యం సేవించడం, ఒత్తిడికి గురవడం కూడా హైబీపీకి కారణమవుతున్నాయి. హైబీపీని సాధారణంగా సైలెంట్ కిల్లర్‌గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నట్లు చాలా మందికి తెలియదు. దీంతో గుండె పోటు బారిన పడుతుంటారు. ప్రాణాలను కోల్పోతుంటారు. కనుక గుండె కొట్టుకోవడం ఏమైనా తేడాగా అనిపించినా, తరచూ అలసట, నీరసం వచ్చినా, ఆయాస పడుతున్నా కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ సమస్య ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు పలు ఆహారాలను తీసుకుంటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను తరచూ తింటుండాలి. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, కీరదోస, క్యాబేజీ, కాలిఫ్లవర్, కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు వంటి ఆకుకూరలతోపాటు ఆకుపచ్చని కూరగాయలను తింటుంటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. బీపీ అధికంగా ఉన్నవారు రోజూ ఆకు కూరలను తింటుంటే త్వరగా బీపీ అదుపులోకి వస్తుంది. ఆకుకూరలను జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. లేదా రోజూ కూరగా చేసి కూడా తినవచ్చు. లేదంటే సలాడ్స్‌లోనూ కలిపి తినవచ్చు. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, మల్బెర్రీలు, రాస్ప్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో బీపీ తగ్గుతుంది. ఈ పండ్లను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. అలాగే ఓట్స్‌ను తింటున్నా కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్‌లో బీటా గ్లూకాన్స్ ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా ఓట్స్‌ను తింటే ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా అరటి పండ్లను కూడా తింటుండాలి. ఈ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. రోజూ ఒక మీడియం సైజ్ ఉన్న అరటి పండును తింటుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటున్నా కూడా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని నియంత్రిస్తాయి. అందువల్ల చేపలను తరచూ తినాలి. అలాగే వెల్లుల్లిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వెల్లుల్లిలో యాల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను తింటుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. బీపీని తగ్గించడంలో బీట్ రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బీట్ రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా సంరక్షించబడుతుంది.