Liver Health | మన శరీరంలో లివర్ అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీంతో శరీరం శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటుంది. పోషకాలను కూడా నిల్వ చేస్తుంది. శరీరానికి అవసరం అయినప్పుడు ఆ పోషకాలను అందిస్తుంది. అయితే మనం చేసే చాలా రకాల తప్పులు, పలు ఇతర కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. కొందరికి లివర్‌లో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లి లివర్ క్లీన్ అవుతుంది.
లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కాఫీ ఎంతగానో మేలు చేస్తుంది. రోజూ కాఫీని తాగడం వల్ల లివర్ పైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. లివర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి లివర్ వాపులను తగ్గిస్తాయి. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. గ్రీన్ టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సీడేటివ్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల రోజూ గ్రీన్ టీని సేవిస్తుంటే లివర్‌లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. లివర్ పనితీరు మందగించిన వారు రోజూ గ్రీన్ టీని తాగుతుంటే ఫలితం ఉంటుంది.
పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది లివర్‌లో ఉండే టాక్సిన్లను బయటకు పంపి లివర్ క్లీన్ అయ్యేలా చేస్తుంది. ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బ్రోకలీ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల్లో పలు రకాల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రం చేస్తాయి. ఈ కూరగాయల్లో ఉండే గ్లూకోసైనోలేట్స్ లివర్‌లోని వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతాయి. దీంతో లివర్ క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటుంది.
చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. సముద్రపు చేపల్లో ఇవి అధికంగా ఉంటాయి. అందువల్ల చేపలను తింటే లివర్‌కు ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే కొవ్వను కరిగిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వాల్ నట్స్‌ను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ నట్స్‌లో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను తరచూ వంటల్లో ఉపయోగించాలి. ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ ఆయిల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. లివర్ వాపులకు గురి కాకుండా రక్షిస్తాయి. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.