Foods At Night | నిత్యం అనేక సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా రాత్రి పూట చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. రాత్రి పూట ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది అనేక వ్యాధులకు కారణం అవుతోంది. రాత్రి పూట ఆలస్యంగా నిద్రించడం వల్ల శరీర మెటబాలిజం దెబ్బ తింటుంది. థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరుకు ఆటంకం కలుగుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం ఇబ్బంది పెడతాయి. శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలా రాత్రి ఆలస్యంగా నిద్రిస్తే అనేక అనర్థాలు కలుగుతాయి. అయితే రాత్రి పూట కొన్ని ఆహారాలను తింటే చక్కగా నిద్ర పట్టడమే కాదు, మన శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట భోజనం చేసిన తరువాత ఒక కివి పండును తినాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే కివి పండును తింటే విటమిన్ సి కూడా అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రాత్రి పూట చెర్రీ పండ్లను తింటుండాలి. లేదా వాటి జ్యూస్‌ను అయినా తాగవచ్చు. ఇవి మన శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అయ్యేందుకు దోహదం చేస్తాయి. మెలటోనిన్ నిద్రను ప్రేరేపించే హార్మోన్. అందువల్ల చెర్రీలను తింటే మనస్సు ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది.
సాయంత్రం సమయంలో గుప్పెడు బాదం పప్పు లేదా వాల్ నట్స్‌ను తింటుండాలి. వీటిల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. దీంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. రోజూ టైముకు నిద్రిస్తారు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేస్తారు. దీంతో వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అదేవిధంగా కమోమిల్ టీని రాత్రి పూట భోజనం చేసిన అనంతరం సేవించాలి. ఇదొక హెర్బల్ టీ. దీన్ని సేవిస్తే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయి. పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పడుతుంది. మరుసటి రోజు నిద్ర లేచే సరికి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు.
చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయి. రాత్రి పూట చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల కళ్లు, మెదడు, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె పోటు రాకుండా నివారించవచ్చు. అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా ఓట్స్‌ను తినాలి. ఇవి శరీరానికి ప్రోటీన్లను అందిస్తాయి. నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. రాత్రి పూట పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పడుతుంది. అరటి పండ్లను తింటున్నా కూడా ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అయితే కఫం అధికంగా తయారయ్యే వారు రాత్రి పూట అరటి పండ్లను తినకూడదు. ఇలా పలు రకాల ఆహారాలను తింటే రాత్రి నిద్ర చక్కగా పట్టడమే కాదు, అనేక పోషకాలను పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉంటారు.