Sweet Lime | మనకు మార్కెట్ లో అన్ని వేళలా లభించే పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. దీనిని స్వీట్ లైమ్, బత్తాయి అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి నారింజ లాగా ఉన్నప్పటికీ దీని తొక్క మందంగా ఉండడంతో పాటు లోపల గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి. మోసంబిలను నేరుగా తినడానికి బదులుగా వీటితో ఎక్కువగా జ్యూస్ లను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఈ జ్యూస్ లో ఆమ్లత్వం తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. మోసంబి జ్యూస్ లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మోసాంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
మోసంబి జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో విటమిన్ సి నిల్వ ఉండదు. రోజువారీ శరీర అవసరాలకు తగ్గట్టు రోజూ ఒక గ్లాస్ మోసంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల విటమిన్ సి లోపం రాకుండా ఉంటుంది. మోసంబి జ్యూస్ డిటాక్సిఫికేషన్ ఏజెంట్ గా కూడా పని చేస్తుంది. దీనిని తాగడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. మోసంబి జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో కూడా మోసంబి జ్యూస్ మనకు సహాయపడుతుంది. మోసంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల జలుబు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. జలుబుతో బాధపడే వారు మోసంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల జలుబు తీవ్రతతో పాటు జలుబు లక్షణాల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
మోసంబి జ్యూస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల విటమిన్ సి లోపం రాకుండా ఉంటుంది. దీంతో చిగుళ్ల నుండి రక్తంకారడం, గాయాలు మానకపోవడం, అలసట, దద్దుర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడే వారు మోసంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఆటలు ఆడే వారు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా మోసంబి జ్యూస్ సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మోసంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్ల ఇన్పెక్షన్ లు, కంటి శుక్లాలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ సమస్యలను నివారించడంలో కూడా మోసాంబి జ్యూస్ మనకు సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఈ జ్యూస్ బ్లీచింగ్, క్లెన్సింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీంతో మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మంపై ముడతలు కూడా తగ్గుతాయి. వృద్దాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. కనుక మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా మోసంబి జ్యూస్ దోహదపడుతుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన, బలమైన జుట్టును మనం సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా మోసంబి జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.