Strawberries | చూసేందుకు ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. స్ట్రాబెర్రీలతో సాధారణంగా కేక్‌లు, ఐస్ క్రీములను తయారు చేస్తుంటారు. ఈ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టమే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో కూడిన చిరు తిండ్లను కూడా ఎక్కువగానే తింటారు. అయితే ఆరోగ్య పరంగా చూసుకుంటే స్ట్రాబెర్రీలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు వీటిల్లో ఉంటాయి. స్ల్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. 80 గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే సుమారుగా 26 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. 0.5 గ్రాముల ప్రోటీన్లు, 0.4 గ్రాముల కొవ్వు, 4.9 గ్రాముల పిండి పదార్థాలు, 13 గ్రాముల ఫైబర్, 136 మిల్లీగ్రాముల పొటాషియం, 49 మైక్రోగ్రాముల ఫోలేట్, 46 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి.
స్ట్రాబెర్రీలలో క్యాలరీలు చాలా తక్కుగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే విటమిన్ సి వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల గుండెను రక్షిస్తాయి. గుండె కండరాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
స్ట్రాబెర్రీలలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే అనేక సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లలో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. పైగా ఈ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కనుక ఈ పండ్లు షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. తరచూ స్ట్రాబెర్రీలను తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తరచూ స్ట్రాబెర్రీలను తింటే షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. స్ట్రాబెర్రీలను తరచూ తింటుంటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
స్ట్రాబెర్రీలలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్య రాకుండా చూస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలను తరచూ తింటే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా తరచూ స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే వీటిని రోజుకు ఒక కప్పు మోతాదుకు మించి తినకూడదు.