Spirulina | ఈ మధ్య కాలంలో చాలా మంది హెర్బల్ ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. చాలా చోట్ల మనకు స్పిరులినా అనే పదం వినిపిస్తోంది. అయితే ఇంతకీ స్పిరులినా అంటే ఏమిటి..? దీన్ని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్పిరులినాను ఆకుపచ్చని ఆహారంగా చెబుతారు. సముద్ర గర్భంలో పెరిగే ఒక రకమైన నాచునే స్పిరులినా అంటారు. దీన్ని సేకరించి ఎండ బెట్టి పొడి చేసి విక్రయిస్తారు. లేదా ట్యాబ్లెట్ల రూపంలోనూ మనకు స్పిరులినా అందుబాటులో ఉంది. డాక్టర్ సలహా మేరకు స్పిరులినాను తీసుకోవచ్చు. స్పిరులినా మనకు అనేక లాభాలను అందిస్తుంది. ఆఫ్రికాలో స్పిరులినాను ఆహారంగా కూడా తీసుకుంటారు.
స్పిరులినాలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడుతున్నవారికి స్పిరులినా ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 1 నుంచి 2 గ్రాముల మేర స్పిరులినా పొడిని తీసుకుంటే ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. మనం తినే ఆహారం నుంచి ఐరన్‌ను శోషించుకోవడం కష్టంగా ఉంటే స్పిరులినాను వాడవచ్చు. పాలకూర కన్నా మనకు అధిక ఐరన్ స్పిరులినాలో లభిస్తుంది. అలాగే స్పిరులినాలో బీటా కెరోటిన్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. 1 గ్రాము స్పిరులినాను తీసుకుంటే 2 మిల్లీగ్రాముల విటమిన్ ఎను పొందవచ్చు. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.
స్పిరులినాను తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. స్పిరులినాను తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలసట, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ కారణంగా కీమో థెరపీ చేయించుకునేవారు దీన్ని వాడితే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. క్యాన్సర్ ఉన్నవారికి స్పిరులినా ఎంతో మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సైతం తగ్గించగలదు. నాడీ మండల సమస్యలు ఉన్నవారు స్పిరులినాను తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. స్పిరులినా లివర్ ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తుంది. లివర్ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కొందరు పోషకాహార నిపుణులు గర్భిణీలకు కూడా స్పిరులినాను వాడమని చెబుతుంటారు. దీని వల్ల శిశువుకు కావల్సిన విటమిన్ ఎ లభిస్తుంది. పిండం ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుకతో లోపాలు రాకుండా అడ్డుకోవచ్చు. బాలింతలు స్పిరులినాను తీసుకుంటే పాలు బాగా పడతాయి. స్పిరులినాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. అందుకనే స్పిరులినాను సౌందర్య సాధన ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తున్నారు. స్పిరులినాను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు. అలాగే జుట్టుకు ఇది హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక స్పిరులినాను వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సలహా మేరకు మోతాదులో దీన్ని వాడితే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని అంటున్నారు.