Soya Bean | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. దీంతో మన శరీరానికి పోషకాలు సరిగ్గా లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాం. అయితే అన్ని పోషకాలను అందించే ఆహారాలు చాలా తక్కువగానే ఉంటాయి. కానీ వాటిని చాలా మంది తినడం లేదు. అలాంటి ఆహారాల్లో సోయాబీన్స్ కూడా ఒకటి. సోయాబీన్స్ గురించి చాలా మందికి తెలుసు. కానీ ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి ఇంకా తెలియదు. ఇవి వట్టి గింజలే అనుకుంటే పొరపాటు పడినట్లే. మన ఆరోగ్యానికి సోయాబీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సోయాబీన్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే సోయాబీన్‌ను రాత్రిపూట డిన్నర్లో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.
సోయాబీన్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. సోయాబీన్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల సోయాబీన్‌ను తింటే సుమారుగా 277 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. అలాగే వీటిల్లో ఐసోఫ్లేవోన్స్ అనే సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. వృద్ధాప్యంలోనూ ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.
సోయాబీన్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల సోయాబీన్‌ను తింటే 36 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారికి సోయాబీన్ చక్కని ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంతో ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. 100 గ్రాముల సోయాబీన్లో సుమారుగా 9.3 గ్రాముల మేర ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం ఉండదు. రోజూ సుఖ విరేచనం అవుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అందువల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
సోయాబీన్లో ఉండే ఐసోఫ్లేవోన్స్ ఈస్ట్రోజన్లా పనిచేస్తాయి. దీంతో మహిళలలో వచ్చే హార్మోన్ సమస్యలను తగ్గిస్తాయి. దీంతో నెల నెలా పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. వ్యాయామం చేసేవారు శక్తి కావాలనుకుంటే రోజూ సోయాబీన్‌ను తీసుకోవాలి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక వ్యాయామం అనంతరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి. దీంతో కండరాలు చక్కని ఆకృతిని పొందుతాయి. చక్కని దేహాకృతి కావాలనుకునేవారు రోజూ జిమ్ చేస్తూ సోయాబీన్‌ను తీసుకోవచ్చు. దీంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. సోయాబీన్‌ను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా సోయాబీన్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఫలితాలను పొందవచ్చు. అయితే వీటిని రాత్రి తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.