Soaked Raisins | కిస్మిస్.. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. వీటిని మనం తరచూ తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తుంటాం. ఖీర్, పాయసం, ఇతర స్వీట్లు తయారు చేసినప్పుడు కిస్మిస్లను వేస్తుంటారు. అయితే వాస్తవానికి మనం వీటిని రోజూ నేరుగా కూడా తినవచ్చు. రోజూ రాత్రి పూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం కిస్మిస్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వారు అంటున్నారు. కిస్మిస్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు రక్షించబడతాయి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.
కిస్మిస్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కిస్మిస్లలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కిస్మిస్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఉదయం కిస్మిస్లను తింటే వెంటనే ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. ఎంత పనిచేసినా అలసిపోరు.
కిస్మిస్లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్, ఇతర గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. కిస్మిస్లలో క్యాల్షియం, బోరాన్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే ఎముకలు దృఢంగా మారి ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరోసిస్ రాకుండా అడ్డుకోవచ్చు. కిస్మిస్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. ముఖంలో కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.
కిస్మిస్లలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ తింటే శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. కిస్మిస్లను తినడం వల్ల చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు కిస్మిస్లను తింటుంటే వెంటనే మూడ్ మారుతుంది. హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇలా నీటిలో నానబెట్టిన కిస్మిస్లను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.