Rowan Berries | బెర్రీలు.. ఈ పండ్ల పేరు చెప్పగానే మనకు స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటి పండ్లు గుర్తుకు వస్తాయి. కానీ బెర్రీల్లో ఇంకా అనేక వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో రొవాన్ బెర్రీలు కూడా ఒకటి. ఇవి చూసేందుకు చిన్నపాటి చెర్రీ పండ్ల మాదిరిగా ఉంటాయి. ఇవి మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలోనే లభిస్తాయి. రొవాన్ బెర్రీలను డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ విక్రయిస్తారు. అయితే రొవాన్ బెర్రీలలో పారాసోర్బిక్ యాసిడ్ ఉంటుంది. కనుక ఈ పండ్లను నేరుగా తినకూడదు. కాస్త ఉడకబెట్టి లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను నేరుగా తింటే పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుందని అంటున్నారు. ఇక రొవాన్ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు.
రొవాన్ బెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో శరీరం వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అలాగే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రొవాన్ బెర్రీలలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గేలా చేస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. రొవాన్ బెర్రీలలో సార్బిటాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆల్కహాల్‌కు చెందిన ఒక సమ్మేళనం. ఇది షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తుంది. మధుమేహం ఉన్నవారు రొవాన్ బెర్రీలను తింటుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఈ బెర్రీలు తియ్యగా ఉన్నప్పటికీ వీటిల్లో ఉండే సార్బిటాల్ కారణంగా వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లను వరంగా చెప్పవచ్చు.
రొవాన్ బెర్రీలు సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. రొవాన్ బెర్రీలలో ఫినోలీక్స్, టెర్పినాయిడ్స్ అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. రొవాన్ బెర్రీలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే మన శరీరంలో చేరే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు నిర్మూలించబడతాయి. ముఖ్యంగా ఇ.కోలి వంటి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. దీంతో అనేక వ్యాధుల రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
రొవాన్ బెర్రీలలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. లుటీన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. రొవాన్ బెర్రీలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. రొవాన్ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే వాపులు తగ్గుతాయి. దీంతో గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఇలా రొవాన్ బెర్రీలను తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.