Red Amaranth Leaves | ఆకుకూరలు తినమని చెబితే చాలా మంది ముఖం చాటేస్తుంటారు. ముఖ్యంగా తోటకూరను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తి చూపరు. తోటకూరలోనూ పలు రకాలు ఉంటాయి. మనకు ఎక్కువగా రెండు రకాల తోటకూర లభిస్తుంది. ఒకటి ఆకుపచ్చ రంగులో ఉన్నది కాగా మరొకటి ఎరుపు రంగులో ఉన్నది. తోటకూర ఉండే రంగును బట్టి అందులో ఉండే పోషకాలు మారుతాయి. ఈ క్రమంలోనే మన ఆరోగ్యానికి ఎరుపు రంగు తోటకూర ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎరుపు రంగు తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎరుపు రంగు తోటకూరను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. ఎరుపు రంగు తోటకూరలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్ అధికంగా ఉంటాయి. పాలిఫినాల్స్, బీటా కెరోటిన్, జియాజాంతిన్, లుటీన్ అధికంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక తోటకూరను తింటే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించవచ్చు. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఆర్థరైటిస్, వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు రాకుండా నివారించవచ్చు. మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటే ఎరుపు రంగు తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ తోటకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల తయారీకి సహాయం చేస్తుంది. దీంతో శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా లభిస్తుంది. దీని వల్ల నీరసం, అలసట తగ్గిపోతాయి.
ఎర్రని తోటకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తుంది. దీంతో రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటాము. అలాగే గాయాలు, పుండ్లు కూడా త్వరగా మానుతాయి. ఎరుపు రంగు తోటకూరలో విటమిన్ కె, క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. విరిగిన ఎముకలు ఉన్నవారు, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఉన్నవారు తోటకూరను తింటుంటే ఎముకలు మళ్లీ దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఎరుపు రంగు తోటకూరలో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. పొటాషియం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఎరుపు రంగు తోటకూర జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణ శక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పేగుల్లో ఆహారం కదలిక సరిగ్గా ఉంటుంది. దీని వల్ల మలబద్దకం రాదు. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎరుపు రంగు తోటకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా దాన్ని రోజూ తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ తోటకూరకు చెందిన జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. శరీర మెబబాలిజం మెరుగు పడుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా ఎరుపు రంగు తోటకూరతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.