Rajma Seeds | మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం వ్యాయామం చేయడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తినాల్సి ఉంటుంది. కొందరు వ్యాయామం అయితే చేస్తారు కానీ అనారోగ్యకరమైన ఆహారాలను తింటారు. దీంతో వ్యాయామం చేసిన ఫలితం దక్కదు. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక అలాంటి ఆరోగ్యకరమైన శక్తినిచ్చే ఆహారాల్లో రాజ్మా గింజలు కూడా ఒకటి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి. చూసేందుకు ముదురు గోధుమ రంగులో అచ్చం కిడ్నీల్లాగే ఉంటాయి. అందుకనే ఈ గింజలను కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. రాజ్మా గింజలను ఉత్తరాది వారు ఎక్కువగా తింటారు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఈ గింజలను తినడం వల్ల శక్తి లభించడమే కాదు, పోషకాలను కూడా పొందవచ్చు. అలాగే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. రాజ్మాను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రాజ్మా గింజల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినలేని వారు ఈ గింజలను తింటే ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. దీని వల్ల శరీర కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. కండరాలు నిర్మాణమవుతాయి. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక కప్పు రాజ్మా గింజలను తింటే చాలు మనకు రోజుకు కావల్సిన ప్రోటీన్లు మొత్తం లభిస్తాయి. అందువల్ల నాన్ వెజ్ తినలేని వారికి రాజ్మా గింజలు ఉత్తమ ఆహారం అని చెప్పవచ్చు. అలాగే శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం అధికంగా చేసే వారు సైతం ఈ గింజలను తినవచ్చు. దీంతో కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. కండరాలు నిర్మాణమవుతాయి. మళ్లీ ఉత్సాహంగా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. చురుగ్గా ఉంటారు. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. బద్దకం పోతుంది. బలహీనంగా ఉన్నవారు రాజ్మాను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
ఈ గింజలను తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. దీంతో పేగుల్లో మలం కదలికలు సులభతరం అవుతాయి. మలబద్దకం తగ్గుతుంది. ఈ గింజలు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ సైతం పటిష్టంగా మారుతుంది. రోగాలు, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
రాజ్మా గింజల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ గింజలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. పైగా ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక షుగర్ లెవల్స్‌ను తగ్గేందుకు దోహదం చేస్తుంది. రాజ్మాను తింటే శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ గింజల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తాయి. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. అధిక బరువు ఉన్నవారు ఈ గింజలను తింటే త్వరగా బరువు తగ్గుతారు. ఈ గింజల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఇలా రాజ్మా గింజలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.