Purple Okra | బెండకాయలు మనం తరచూ తినే కూరగాయల్లో ఒకటి. వీటితో కూర, పులుసు, వేపుడు చేస్తుంటారు. చారులోనూ బెండకాయలను వేసి తింటారు. బెండకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో అనేక రకాల వంటకాలను చేయవచ్చు. అయితే బెండకాయల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో పర్పుల్ కలర్ బెండకాయలు కూడా ఒకటి. ఆకుపచ్చని బెండకాయల తరువాత మనకు ఇవే అధికంగా లభిస్తాయి. పర్పుల్ కలర్ బెండకాయల్లో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే ఈ కాయలు ఆ రంగులో ఉంటాయి. ఆంథో సయనిన్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పర్పుల్ కలర్ బెండకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
పర్పుల్ రంగు బెండకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బెండకాయల్లోని ఆంథో సయనిన్స్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. కనుక ఈ కాయలను తింటే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు కూడా తగ్గిపోతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ బెండకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక ఈ కాయలను తింటే క్యాన్సర్ కణాలు పెరగనీయకుండా అడ్డుకోవచ్చు. పర్పుల్ బెండకాయల్లో మ్యుసిలేజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జిగురు లాంటి పదార్థం. ఇది మన శరీరంలో చేరితే కొలెస్ట్రాల్‌కు అతుక్కుంటుంది. దీంతో కొలెస్ట్రాల్ తొలగించబడుతుంది. జీర్ణ వ్యవస్థ ద్వారా అది బయటకు వస్తుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు ఈ బెండకాయలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం పర్పుల్ రంగు బెండకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించుకోవచ్చు. ఈ కాయల్లో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి. ఈ కాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అలాగే షుగర్ లెవల్స్ తగ్గేందుకు కూడా సహాయం చేస్తుంది.
పర్పుల్ కలర్ బెండకాయలలో అనేక విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ కాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ కాయల్లో ఉండే విటమిన్ బి9 (ఫోలేట్) గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయ పడుతుంది. ఈ బెండకాయల్లో ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తుంది. కణాలు నిర్మాణం అయ్యేలా చూస్తుంది. పర్పుల్ కలర్ బెండకాయల్లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. మెటబాలిజం సరిగ్గా ఉండేలా చూస్తాయి. ఇలా ఈ బెండకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.