Purple Carrots | క్యారెట్లు అనగానే మనకు చూడచక్కని ఆకర్షణీయమైన నారింజ రంగు గుర్తుకు వస్తుంది. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో ఎన్నో వంటకాలను కూడా తయారు చేస్తుంటారు. క్యారెట్లతో కూరలను కూడా చేస్తుంటారు. పలు వంటల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. క్యారెట్లను పచ్చిగా తినవచ్చు. లేదా జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. క్యారెట్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే క్యారెట్లలోనూ పలు రకాలు ఉంటాయి. సాధారణంగా మనం నారింజ రంగులో ఉండే క్యారెట్లను వాడుతాం. కానీ పర్పుల్ కలర్ క్యారెట్లు కూడా మనకు లభిస్తాయి. అయితే వీటిని జన్యుపరంగా పండించిన క్యారెట్లుగా పొరపాటుపడుతుంటారు. కానీ నారింజ రంగు క్యారెట్లలాగే పర్పుల్ రంగు క్యారెట్లు కూడా సహజసిద్ధమైనవే. ఇవి జన్యుపరంగా అభివృద్ధి చేయబడినవి కావు. అందువల్ల పర్పుల్ రంగు క్యారెట్లను కూడా ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. వీటిని తింటున్నా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పర్పుల్ రంగు క్యారెట్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్లు కె, బి6, సి అధికంగా ఉంటాయి. పర్పుల్ రంగు క్యారెట్లలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. అందుకనే ఈ క్యారెట్లు పర్పుల్ రంగులో ఉంటాయి. ఇవే యాంటీ ఆక్సిడెంట్లు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, పర్పుల్ రంగు క్యాబేజీలోనూ ఉంటాయి. కనుక పోషకాల విషయంలో ఈ ఆహారాలన్నీ ఒకే స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. ఇక పర్పుల్ రంగు క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పర్పుల్ రంగు క్యారెట్లలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతాయి. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పర్పుల్ రంగు క్యారెట్లలో ఉండే ఆంథో సయనిన్స్, ఫినోలిక్ సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. అందువల్ల ఈ క్యారెట్లను తింటే కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. పర్పుల్ రంగు క్యారెట్లను తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి ఈ క్యారెట్లు ఎంతో మేలు చేస్తాయి. పర్పుల్ రంగు క్యారెట్లలో ఉండే ఆంథో సయనిన్స్ గ్లూకోజ్ మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
పర్పుల్ రంగు క్యారెట్లను తింటే కంటి చూపు మెరుగు పడడమే కాదు, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా మారి యాక్టివ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం పోతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు ఈ క్యారెట్లను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కారణంగా ఈ క్యారెట్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పర్పుల్ రంగు క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటాకెరోటిన్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా పర్పుల్ రంగు క్యారెట్లను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.