Pine Nuts Benefits | నట్స్ అంటే మనకు ముందుగా జీడిపప్పు, బాదంపప్పు గుర్తుకు వస్తాయి. చాలా మంది వీటిని తినేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం రోజూ నట్స్‌ను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక వీటిని రోజూ నానబెట్టి తినాలని చెబుతుంటారు. రోజూ వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ చేసే వారు కచ్చితంగా బాదం పప్పును తింటుంటారు. అలాగే జీడిపప్పు కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మీకు తెలుసా..? తక్షణ శక్తి కావాలంటే ఈ రెండు పప్పుల కన్నా ఇంకో రకమైన పప్పును తినాలి. అవే పైన్ నట్స్. ఈ పేరును మీరు ఎప్పుడూ వినీ ఉండరు. కానీ ఈ నట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.
పైన్ నట్స్ మనకు సూపర్ మార్కెట్లలో ఎక్కువగా లభిస్తాయి. ఈ నట్స్ వాస్తవానికి జీడిపప్పు, బాదంపప్పు కన్నా తక్షణ శక్తిని ఎక్కువగా అందిస్తాయి. కనుక వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు బాగా అలసిపోతుంటే ఈ నట్స్‌ను తింటే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. ఈ నట్స్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తినాలి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎంత పనిచేసినా అలసట అనేది ఉండదు. ఇక పైన్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నట్స్‌ను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఐరన్, మెగ్నిషియం, ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. కండరాలను బలంగా మార్చుతాయి. శరీర మెటబాలిజంను పెంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో జీవక్రియలు అన్నీ సక్రమంగా నిర్వహించబడతాయి.
పైన్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ నట్స్‌ను రోజూ తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నట్స్‌ను రోజూ తింటుంటే టైప్ 2 డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. పైన్ నట్స్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరం ఆక్సిజన్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. దీంతో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట రాదు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
పైన్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ నట్స్ లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల హైబీపీ తగ్గడమే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పైన్ నట్స్‌లో మెగ్నిషియం, ఫాస్ఫరస్, విటమిన్ కె, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించవచ్చు. ఇలా పైన్ నట్స్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.