Okra | బెండకాయలు.. వీటినే ఇంగ్లిష్‌లో ఓక్రా అని, లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తారు. బెండకాయలను మొదటగా ఆఫ్రికాలో పండించారు. అక్కడి నుంచి ఇవి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బెండకాయలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. బెండకాయలను లేతగా ఉన్నప్పుడే తినాల్సి ఉంటుంది. ముదిరితే రుచి అంత బాగోవు. ఇక బెండకాయలతో మనం వేపుడు, పులుసు వంటివి చేస్తుంటాం. చాలా మంది వీటిని చారు వంటి వాటిలోనూ వేస్తుంటారు. దీంతో ఇవి చక్కని రుచిని కలిగి ఉంటాయి. అయితే బెండకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి.
బెండకాయల్లో విటమిన్లు ఎ, సిలతోపాటు మెగ్నిషియం, పొటాషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కాయలను తరచూ తినడం వల్ల వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. బెండకాయలను తరచూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణాశయం, పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బెండకాయలను తినడం వల్ల మన శరీరం ఆహారాల్లో ఉండే కొవ్వును శోషించుకోదు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకోవచ్చు. ఫలితంగా రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
బెండకాయల్లో పాలిఫినాల్స్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిల్లో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి బెండకాయలు ఒక వరం అనే చెప్పవచ్చు. వీటితో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. బెండకాయలను తినడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అధిక బరువు ఉన్నవారు బెండకాయలను తరచూ తింటుంటే బరువును తగ్గించుకోవచ్చు. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేయడంలో బెండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
బెండకాయల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. తరచూ బెండకాయలను తినడం వల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. వీటిని తింటుంటే శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. బెండకాయల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఈ కాయల్లో క్యాల్షియం, విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.