Noni Fruits | పండ్లు అంటే సాధారణంగా తియ్యగా ఉంటాయి. కొన్ని తియ్యగా ఉండకపోయినా చప్పగా లేదా పుల్లగా ఉంటాయి. అయితే మీకు తెలుసా..? ఇప్పుడు మేం చెప్పబోయే ఈ పండు మాత్రం చేదుగా ఉంటుంది. వాసన కూడా అంత నచ్చేదిగా ఉండదు. కానీ ఇది కూడా పండ్ల జాబితాకే చెందుతుంది. ఇంతకీ అదేం పండు అని అడగబోతున్నారా..? ఏమీ లేదండీ.. అదే.. నోని ఫ్రూట్. ఇది ఆకుపచ్చ-పసుపు రంగుల కలయికలో ఉంటుంది. ఆసియా, ఆస్ట్రేలియాలలో అనేక ప్రాంతాల్లో ఈ పండ్లను వాడుతుంటారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కనుక దీంతో పలు ఔషధాలను కూడా తయారు చేస్తారు. ఈ పండ్లకు సుమారుగా 2వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతున్నారు. ఇది వాస్తవానికి పండే అయినా రుచి చేదుగా ఉంటుంది కనుక దీన్ని చాలా మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఈ పండు మాత్రమే కాదు, దీని జ్యూస్ కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
నోని పండ్లలో ఫ్లేవనాయిడ్స్, లిగ్నన్స్, ఇరిడాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక వీటి జ్యూస్‌ను తాగితే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలను తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
నోని పండ్లలో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్‌గా వాడవచ్చు. ఈ పండ్ల జ్యూస్‌ను తాగుతుంటే నొప్పులు తగ్గుతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. నోని పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. సర్వికల్ స్పాండిలైసిస్ అనే సమస్యతోపాటు ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్త నాళాల వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
నోని పండ్ల జ్యూస్ ను తాగితే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా నోని పండ్ల జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల కొందరికి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు దీనికి దూరంగా ఉండాలి. నోని పండ్ల జ్యూస్ చేదుగా ఉంటుంది కనుక అందులో కొందరు చక్కెర లాంటివి కలిపి తాగుతారు. అలా తాగితే ఉపయోగం ఉండదు. నేరుగానే ఈ జ్యూస్‌ను సేవించాల్సి ఉంటుంది.