Milk With Ghee | పాలను తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది రోజూ పాలను తాగేందుకు ఇష్టపడతారు. అయితే పాలలో నెయ్యి కలిపి తీసుకుంటే ఎంతో ఉత్తమ ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పాలలో అర టీస్పూన్ నెయ్యి కలిపి రాత్రి పూట సేవిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో నెయ్యి కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంపొందిస్తుంది. దీంతో జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో మంచి బ్యాక్టీరియా సహాయం చేస్తుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు పాలలో నెయ్యి కలిపి రాత్రి పూట తాగితే ఎంతో ఉపయోగం ఉంటుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకనే రాత్రి పూట పాలను తాగితే నిద్ర చక్కగా పడుతుందని చెబుతారు. అయితే పాలలో నెయ్యి కలిపి తాగితే ఎంత నిద్ర రాని వారు కూడా గాఢంగా నిద్రపోతారు. ఎందుకంటే నెయ్యి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. కనుక రాత్రిపూట పాలు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రోకి జారుకుంటారు.
పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యిలో విటమిన్ కె2 ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం ఎముకలకు చేరేలా చేస్తుంది. అందువల్ల పాలలో నెయ్యి కలిపి తాగితే ఎముకలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజూ తాగితే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఈ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మ కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో చర్మం తేమగా మారుతుంది. కాంతివంతంగా తయారై మెరుస్తుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి.
నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే శరీరానికి కావల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుఉంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి. పాలలో నెయ్యి కలిపి రోజూ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే అధికంగా బరువు ఉన్నవారు, డయాబెటిస్తో బాధపడుతున్నవారు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.