Mangosteen Fruit | సూపర్ మార్కెట్లలో లేదా బయట పండ్ల దుకాణాల్లో మనకు అప్పుడప్పుడు కొన్ని చిత్రమైన పండ్లు దర్శనమిస్తుంటాయి. అలాంటి పండ్లలో మాంగోస్టీన్ పండ్లు కూడా ఒకటి చూసేందుకు పత్తికాయల ఆకారంలో ఉంటాయి. లోపలంతా తెల్లని గుజ్జు మెత్తగా క్రీమ్‌లాగా ఉంటుంది. ఇది తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అయితే ఈ పండ్లను చాలా మంది చూసి ఉండరు. కానీ మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వాస్తవానికి ఈ పండ్లను పోషకాలకు గనిగా చెబుతారు. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్లలో ఉంటాయి. కనుక ఈ పండ్లు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.
మాంగోస్టీన్ పండ్లలో జాంతోన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ పండ్లలో ఉండే జాంతోన్స్, ఆల్ఫా మాంగోస్టిన్ అనే సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరం లోపల, బయట ఉండే వాపులను తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. మాంగోస్టీన్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలు రాకుండా చూస్తుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
ఈ పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఈ పండ్లను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఈ పండ్లలో పొటాషియం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. అందువల్ల హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు ఈ పండ్లను తరచూ తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఈ పండ్లను తినాలి.
మాంగోస్టీన్ పండ్లలో ఉండే జాంతోన్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ గుణాలను సైతం కలిగి ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. ఈ పండ్లను తింటుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. దీని వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. వాపులకు గురికాకుండా చూస్తాయి. మొటిమలు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు నయమవుతాయి. ఈ పండ్లలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి కనుక వీటిని తింటే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ఇలా ఈ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.