Lemon Coffee | రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కొందరు అదే పనిగా టీ, కాఫీలను తాగుతుంటారు. కొందరు టీ ప్రియులు ఉంటే, కొందరు కాఫీ ప్రియులు ఉంటారు. అయితే రోజుకు అన్ని సార్లు కాఫీ లేదా టీ లను తాగడం అంత మంచిది కాదు. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను తాగాల్సి ఉంటుంది. అయితే టీ, కాఫీలను అధికంగా తాగేవారు పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాఫీ ప్రియులు కాఫీని మరో రకంగా తయారు చేసి తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. కాఫీ ఆరోగ్యకరంగా మారాలంటే దాన్ని లెమన్ కాఫీగా తయారు చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు బ్లాక్ కాఫీ తయారు చేయడం వస్తే చాలు. అందులోనే కాస్త నిమ్మరసం పిండితే అదే లెమన్ కాఫీ అవుతుంది. దీన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.
లెమన్ కాఫీని తాగడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ లెమన్ కాఫీని తాగుతుంటే ప్రయోజనం ఉంటుంది. లెమన్ కాఫీని సేవించడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. అలాగే క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు లెమన్ కాఫీని తాగుతుంటే ప్రయోజనం ఉంటుంది. లెమన్ కాఫీని తాగడం తల నొప్పి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. తలలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. తీవ్రంగా తలనొప్పి ఉన్నవారు లెమన్ కాఫీని సేవిస్తే వెంటనే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
లెమన్ కాఫీ సహజసిద్ధమైన డైయురెటిక్గా పనిచేస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న ద్రవాలను బయటకు పంపిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. లెమన్ కాఫీ సహజసిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని తాగితే పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అయితే విరేచనాలు అవుతున్న వారు లెమన్ కాఫీని సేవించకూడదు. లెమన్ కాఫీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. చర్మానికి తేమ లభించేలా చేస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది.
నిమ్మరసం, కాఫీ సహజసిద్ధంగా రెండూ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక లెమన్ కాఫీని సేవిస్తే కొందరికి పడకపోవచ్చు. కడుపులో తీవ్రమైన మంట వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ కాఫీని సేవించకూడదు. కొందరికి శరీరంలో కెఫీన్ మోతాదు మించితే ఆందోళన, కంగారు, నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక వీరు కూడా ఈ కాఫీని తాగకూడదు. లెమన్ కాఫీని సేవిస్తే కొందరికి పొట్టలో అసౌకర్యం కలగవచ్చు. అలాంటి వారు కూడా ఈ కాఫీని సేవించకపోవడమే మంచిది.