Horse Gram | మన పూర్వీకులు తినే ఆహారం అప్పట్లో చాలా భిన్నంగా ఉండేది. వారు బలవర్ధకమైన ఆహారం తినేవారు. అందుకనే 60 లేదా 70 ఏళ్లు వచ్చే వరకు కూడా చురుగ్గా పనిచేసేవారు. వారి ఆయుర్దాయం కూడా ఎక్కువగానే ఉండేది. అలా వారు తిన్న ఆహారాల్లో ఉలవలు కూడా ఒకటి. ఉలవలు అంటే గుర్రాలకు పెట్టే ఆహారంగా భావిస్తారు. కానీ ఉలవలను మనం కూడా తినవచ్చు. మన బామ్మలు ఉలవలతో చారు తయారు చేసి తాగేవారు. ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఉలవల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉలవలు చాలా బలవర్ధకమైన ఆహారమని వారు అంటున్నారు.
ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఉలవల్లో వాటి బరువులో సుమారుగా 24 శాతం మేర ప్రోటీన్లు ఉంటాయి. కనుక ఇవి చాలా బలాన్ని ఇస్తాయి. నాన్ వెజ్ తినని వారు ప్రోటీన్ల కోసం ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉలవల్లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఉలవలను తినడం వల్ల ప్రోటీన్లు, ఫైబర్ రెండింటినీ పొందవచ్చు. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో మలం సరిగ్గా కదులుతుంది. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది.
ఉలవల్లో డైయురెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే శరీరంలో అధికంగా ఉండే నీరు మూత్రం ద్వారా బయటకు పోతుంది. బరువు తగ్గుతారు. శరీరంలోని టాక్సిన్లు, ఇతర వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. ఉలవల్లో ఉండే పలు రకాల సమ్మేళనాల వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. కిడ్నీ స్టోన్లు ఉన్నా కూడా అవి కరిగిపోయేలా చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఉలవల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా ఉలవలను తినవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఉలవల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీని కారణంగా కణాలకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా ఉలవలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.