Honey And Turmeric | పసుపు, తేనె.. ఇవి రెండూ మన ఇళ్లలో ఉండేవే. వీటిని మనం రోజూ అనేక రకాలుగా వాడుతుంటాం. పసుపును వంటల్లో వేస్తాం. తేనెను పానీయాల్లో కలిపి తాగుతాం. అయితే మీకు తెలుసా..? పసుపు, తేనె మిశ్రమం ఎన్నో రోగాలకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ మిశ్రమాన్నే గోల్డెన్ హనీ అని కూడా అంటారు. ఈ రెండు పదార్థాలది చాలా శక్తివంతమైన కాంబినేషన్. దీన్ని తీసుకుంటే అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. అనేక లాభాలు కలుగుతాయి. ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ పసుపు కలిపి నేరుగా అలాగే ఉదయాన్నే తినవచ్చు. లేదా పసుపును నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో కాస్త తేనె కలిపి తాగవచ్చు. పెరుగులోనూ ఈ రెండింటినీ కలిపి తీసుకోవచ్చు. అయితే ఈ మిశ్రమానికి మిరియాల పొడిని కూడా కలిపితే ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ మిశ్రమంలో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనంగా పనిచేస్తుంది. అందువల్ల ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలో బాహ్యంగా, అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
పసుపు, తేనె మిశ్రమం ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీంతో పైత్య రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వులను సరిగ్గా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు.
పసుపు, తేనె మిశ్రమంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్న కారణంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న కారణంగా దీన్ని తీసుకుంటే మొటిమలు, మచ్చలు, చర్మంపై ఉండే దురద, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇలా పసుపు, తేనె మిశ్రమం మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.