Holy Basil Leaves Water | వర్షాకాలంలో అధిక శాతం మందికి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతోపాటు జ్వరాలు కూడా వస్తుంటాయి. కొన్ని దోమలు కుట్టడం వల్ల వస్తే మరికొన్ని కలుషిత ఆహారం, నీళ్ల వల్ల వస్తాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతుంటాయి. వీటికి గాను డాక్టర్లు ఇచ్చే మందులను వాడుతూ ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటించాలి. దీంతో వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. అయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే ఈ సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు గాను తులసి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. తులసి ఆకులతో తయారు చేసే నీళ్లను తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఒకపాత్రలో కొన్ని నీళ్లను తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తరువాత వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇలా తులసి ఆకుల నీళ్లను రోజుకు 2 సార్లు తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తులసి ఆకుల్లో అడాప్టోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులతో నీళ్లను తయారు చేసి తాగితే ఒత్తిడి తగ్గుతుంది. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో ఆందోళన నుంచి బయట పడతారు. మూడ్ మారుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్, ఆందోళన ఉన్నవారు రోజూ ఈ నీళ్లను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. తులసి ఆకుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం ఫ్రీ ర్యాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ తగ్గడంతోపాటు జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
తులసి ఆకులు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ ఆకులతో నీళ్లను తయారు చేసి తాగితే పలు జీర్ణాశయ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి, గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఏర్పడిన అసౌకర్యం తొలగిపోతుంది. తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, ఎక్స్పెక్టోరెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి శ్వాసకోశ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల నీళ్లను తాగుతుంటే శ్వాస నాళాల్లో, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. గాలి సరిగ్గా ఆడుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తులసి ఆకుల్లో షుగర్ లెవల్స్‌ను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. ఈ ఆకుల్లో అనేక రకాల ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేలా చేయడంతోపాటు ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తులసి ఆకుల్లో సహజసిద్ధమైన డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. దీంతో చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. మొటిమలు తగ్గిపోతాయి. తులసి ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. చర్మంపై ఉండే వాపులను, ఎరుపు దనాన్ని పోగొడతాయి. ఇలా తులసి ఆకుల నీళ్లను తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చు.