Healthy Breakfast | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలో ఉన్నవారికే డయాబెటిస్ వచ్చేది. కానీ నేటి తరుణంలో యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం 2025 పూర్తయ్యే వరకు ప్రపంచ డయాబెటిక్ రోగులలో 80 శాతం మంది భారత దేశంలోనే ఉంటారని వెల్లడైంది. ఇక డయాబెటిస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. శారీరక శ్రమ చేయకపోవడం ప్రధాన కారణం అయితే ఆహారం ఇంకో ముఖ్య కారణం అని చెప్పవచ్చు. నేటి బిజీ యుగంలో చాలా మంది బయటి ఫుడ్‌కు, జంక్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్‌ను తెచ్చి పెడుతోంది. ఆహారంలో మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను వెనక్కి మళ్లించడం పెద్ద కష్టమేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మనం తింటున్న ఆహారాల్లో చాలా వరకు కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటున్నాయి. అలాగే రీఫైన్డ్ ఆయిల్, రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, మైదా వంటి వాటిని చాలా మంది తింటున్నారు. నూనె పదార్థాలను కూడా తింటున్నారు. ఇవన్నీ డయాబెటిస్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. కానీ ఫైబర్ లేని జంక్ ఫుడ్‌ను తింటున్నారు. ఇది కూడా డయాబెటిస్ వచ్చేందుకు కారణం అవుతోంది. ఇక సాధారణంగా మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీ, దోశ, పూరీ వంటివి తింటుంటాం. కానీ వీటిల్లో రీఫైన్డ్ చేయబడిన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతుంది. కనుక ఉదయం తీసుకునే ఆహారం ఆరోగ్యవంతమైనది అయి ఉండాలి.
తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే డయాబెటిస్‌ను అరికట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం తినే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చూడాలి. ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉండేలా చూడాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ అంతగా పెరగవు. దీంతో డయాబెటిస్ నివారించబడుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా కోడిగుడ్లు, పండ్ల రసాలు, పండ్లు, గ్రీన్ సలాడ్ వంటి ఆహారాలను తినాలి. ఇక సాధారణ ఆయిల్‌కు బదులుగా ఆలివ్ నూనెను వాడితే మంచిది. దీని వల్ల శరీరంలో క్యాలరీలు చేరవు. ఇది బరువు పెరగకుండా చూస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా సహాయ పడతుంది. అదేవిధంగా టమాటాలు, కొత్తిమీర, హెర్బల్ టీ వంటి ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే సాధారణంగా కోడిగుడ్లు అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది నమ్ముతారని, కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక కోడిగుడ్డును తినడం వల్ల లాభమే కానీ నష్టం ఉండదని అంటున్నారు. కోడిగుడ్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. అధిక బరువు తగ్గేలా చేస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. అందుకని ఉదయం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే దాంతో షుగర్ వ్యాధి గ్రస్తులు ఆరోగ్యంగా జీవించవచ్చు. షుగర్ లెవల్స్ ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉంటాయి.