Green Tea | రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. రోజు మొత్తం మీద టీ, కాఫీలను తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉదయం టీ, కాఫీలను తాగడానికి బదులుగా ఒక పానీయాన్ని తాగండి. దీంతో మీకు టీ, కాఫీ తాగిన ఫీలింగ్ కలగడంతోపాటు అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇంతకీ ఆ పానీయం ఏదా.. అని అనుకుంటున్నారా.. అదేనండీ.. గ్రీన్ టీ. అవును అదే. ఉదయం మీరు తాగే టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగి చూడండి. అద్భుతమైన లాభాలను పొందవచ్చు. గ్రీన్ టీని ఉదయాన్నే తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో రోజంతా క్యాలరీలు ఖర్చవుతూనే ఉంటాయి. శరీరంలో కొవ్వు చేరదు. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. గ్రీన్ టీలో ఉన్న సీక్రెట్ ఇదే. ఇక దీని వల్ల ఇంకా అనేక లాభాలు కలుగుతాయి.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లకు గ్రీన్ టీని నెలవుగా చెప్పవచ్చు. పాలిఫినాల్స్, కాటెకిన్స్ తదితర యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్ కణాలు పెరగవు. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. గ్రీన్ టీని సేవించడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయి. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది.
గ్రీన్ టీలో కెఫీన్ ఉంటుంది. కానీ మీరు రోజూ తాగే టీ, కాఫీల కన్నా తక్కువ మోతాదులోనే ఉంటుంది. అందువల్ల గ్రీన్ టీని రోజుకు 2 కప్పుల వరకు నిరభ్యంతరంగా తాగవచ్చు. ఇక కెఫీన్ మనకు ఎలాగూ కొంత మోతాదులో శరీరానికి అవసరం అవుతుంది. కనుక ఆ అవసరాన్ని గ్రీన్ టీ తీరుస్తుంది. కెఫీన్ తోపాటు గ్రీన్ టీలో ఉండే ఎల్-థియనైన్ అనే సమ్మేళనం మెదడును చురుగ్గా ఉంచుతాయి. యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం పోతుంది. అప్రమత్తత పెరుగుతుంది. ఉదయాన్నే బద్దకంగా ఉందని భావించే వారు గ్రీన్ టీని సేవిస్తే ఎంతో హుషారు వస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయవచ్చు. గ్రీన్ టీని సేవించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. మతిమరుపు తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
గ్రీన్ టీని గుండె ఆరోగ్యానికి లభించిన వరంగా చెప్పవచ్చు. దీన్ని తాగుతుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రావు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. గ్రీన్ టీని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో అద్బుతంగా పనిచేస్తాయి. గ్రీన్ టీని తాగితే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి గ్రీన్ టీకి ఉంది. గ్రీన్ టీని తాగుతుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షణ లభిస్తుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి సహజసిద్ధంగా మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా గ్రీన్ టీతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే గ్రీన్ టీని నేరుగానే తాగాలి. అందులో చక్కెర కలపకూడదు. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు.