Chilli | కారం అనగానే చాలా మంది బాబోయ్ అని పారిపోతారు. మన పెద్దలు, పూర్వీకులు కారం ఎక్కువగా తినేవారు. కానీ నేటి జంక్ ఫుడ్ యుగంలో కారం తినే వారి సంఖ్య తగ్గుతోంది. తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌కు అలవాటు పడి కారం తినడమే మానేశారు. కానీ ఆరోగ్యానికి కారం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం అన్ని రుచులు కలిగిన ఆహారాలను తరచూ తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అందుకని కేవలం తీపి మాత్రమే కాదు, కారం ఆహారాలను కూడా తరచూ తినాలి. ఎండు కారం తినలేమని అనుకుంటే పచ్చి మిర్చిని నిత్యం కూరల్లో ఉపయోగించవచ్చు. మిర్చిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మిర్చిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు తరచూ కారం తింటే మంచిది.
డయాబెటిస్ కారణంగా కొందరికి నరాల బలహీనత ఏర్పడుతుంది. నరాలు డ్యామేజ్ అవుతాయి. దీంతో శరీరంలో పలు చోట్ల సులభంగా గాయాలు అవుతాయి. అలాగే ఆయా చోట్ల స్పర్శ కూడా సరిగ్గా ఉండదు. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కానీ కారాన్ని తరచూ తింటే ఈ సమస్య రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడంలోనూ కారం బాగానే పనిచేస్తుంది. మిర్చిలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. తరచూ మిర్చిని తింటున్నా లేదా ఎండు కారాన్ని ఆహారంలో భాగం చేసుకున్నా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తలలో రక్త సరఫరా మెరుగు పడి తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిర్చిలో క్యాన్సర్ కణాలను నిర్మూలించే అనేక సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తరచూ కారం తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు కారాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారు. శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. కారం బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కారాన్ని తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే అధిక కొలస్ట్రాల్ ఉన్నవారు కూడా కారాన్ని తినాలి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
ఒక టీస్పూన్ చక్కెర, ఒకటి లేదా రెండు బాదంపప్పులు, ఒక పండు మిరపకాయను కలిపి దంచాలి. దీన్ని చిన్న గోళీ సైజులో ట్యాబ్లెట్లా తయారు చేసి తరచూ మింగుతుండాలి. దీంతో గొంతు బొంగురు పోవడం, గొంతులో గరగర, గొంతు మంట వంటి సమస్యలు తగ్గుతాయి. గాయకులు, ఉపన్యాసకులు, టీచర్లకు మేలు చేస్తుంది. 100 గ్రాముల బెల్లంలో ఒక గ్రాము ఎర్ర మిరపకాయల పొడిని కలిపి చిన్న చిన్న ట్యాబ్లెట్లలా తయారు చేసి నీళ్లతో తీసుకోవాలి. దీంతో కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అర గ్రాము ఎండు మిరప పొడి, 2 గ్రాముల శొంఠి పొడితో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. కడుపు నొప్పి నుంచి బయట పడవచ్చు. తరచూ కారం తింటుంటే నాలుకపై ఉన్న రుచి కళికలకు కొత్త శక్తి వస్తుంది. ఆహారం రుచి తెలుస్తుంది. ఆకలి కూడా పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది. కారం తింటే ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీన్ని మోతాదులోనే తినాలి. మరీ అతిగా తింటే కడుపులో మంట, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.