Green Apples | మార్కెట్లో మనకు రకరకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో యాపిల్స్ కూడా ఒకటి. యాపిల్స్ అనగానే చూడచక్కని ఎరుపు రంగులో ఉండే పండ్లే అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ యాపిల్స్‌లో అనేక రకాలు ఉంటాయి. మనకు మార్కెట్లో ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే యాపిల్స్‌తోపాటు గ్రీన్ యాపిల్స్ కూడా లభిస్తుంటాయి. అయితే చాలా మంది ఎరుపు రంగు యాపిల్స్‌నే తింటుంటారు. గ్రీన్ యాపిల్స్‌ను అంతగా పట్టించుకోరు. వాస్తవానికి గ్రీన్ యాపిల్ పండ్లు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ యాపిల్స్‌లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక విటమిన్లు, మినరల్స్ గ్రీన్ యాపిల్స్‌లో ఉంటాయి. కనుక గ్రీన్ యాపిల్స్‌ను కూడా రోజూ తినాలని వారు సూచిస్తున్నారు.
గ్రీన్ యాపిల్స్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఎరుపు రంగు యాపిల్స్ కన్నా గ్రీన్ యాపిల్స్‌లోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. గ్రీన్ యాపిల్స్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య ఉన్నవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. రోజుకు ఒక గ్రీన్ యాపిల్‌ను తింటుంటే మలబద్దకం తగ్గుతుంది. అలాగే డయేరియా నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ యాపిల్స్‌ను తింటే జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది.
గ్రీన్ యాపిల్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్ యాపిల్స్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. గ్రీన్ యాపిల్స్‌ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా పెరగవు. అందువల్ల షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఎరుపు రంగు యాపిల్స్ కన్నా గ్రీన్ యాపిల్స్‌ను తింటేనే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గ్రీన్ యాపిల్స్ మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ యాపిల్స్‌లో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం అయ్యే బ్యాక్టీరియాను వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉంటుంది.
గ్రీన్ యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా రక్షిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా శరీరాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. గ్రీన్ యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను సంరక్షిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు గ్రీన్ యాపిల్స్‌ను రోజూ తింటే ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే లివర్ పనితీరు మెరుగు పడుతుంది. గ్రీన్ యాపిల్స్‌ను తరచూ తింటుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ ఎ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఇలా గ్రీన్ యాపిల్స్‌తో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.