Ginger Juice | అల్లాన్ని మనం ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నాం. దీన్ని పలు రకాల కూరల్లో వేస్తుంటారు. ముఖ్యంగా మసాలా వంటకాలు చేసినప్పుడు అల్లం తప్పనిసరిగా వేస్తారు. దీంతో వంటకాలకు రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లంకు ఎంతగానో ప్రాముఖ్యతను కల్పించారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పలు రకాల ఔషధాల తయారీకి కూడా అల్లాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ అల్లం రసం సేవించాలని వారు సూచిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. అల్లంలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
అల్లం రసం తాగడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది. అల్లంలో జింజరాల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారం సులభంగా కదిలేలా చేస్తాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వికారంగా ఉన్నవారు, వాంతికి వచ్చినట్లు అనిపించే వారు అల్లం రసం సేవించడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. అల్లంలో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. చల్లని వాతావరణంలో ఇది మేలు చేస్తుంది. పైగా మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
అల్లం రసాన్ని పరగడుపునే సేవిస్తుంటే అందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే వ్యాయామం చేసిన తరువాత వచ్చే నొప్పులు, స్త్రీలకు రుతు సమయంలో కలిగే నొప్పులు సైతం అల్లం రసం సేవించడం వల్ల తగ్గిపోతాయి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు, రోగాలకు శరీరం వ్యతిరేకంగా పోరాడుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగాల బారి నుంచి సురక్షితంగా ఉంటారు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అల్లం రసం సేవించడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవారు రోజూ పరగడుపునే అల్లం రసం తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అల్లం రసం తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి కూడా అల్లం రసం ఔషధంలా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలోని అంతర్గత వాపులు తగ్గిపోతాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట రావు. ఇలా రోజూ పరగడుపునే అల్లం రసం సేవిస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు.