Ghee With Milk | నెయ్యిని మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. మనం తినే ఆహారాలకు నెయ్యి చక్కటి రుచిని అందిస్తుంది. దీనిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన శరీర మొత్తం ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా నెయ్యిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో విటమిన్ ఎ,డి, ఇ, కె వంటి పోషకాలు ఉంటాయి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. మనం సాధారణంగా భోజనంలో నెయ్యిని కలిపి తీసుకుంటూ ఉంటాం. ఆహారంతో కాకుండా గోరు వెచ్చని పాలల్లో నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలను, నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వారు తెలియజేస్తున్నారు. నెయ్యిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అలాగే దీనిని ఎంత మొత్తంలో, ఏ సమయంలో తీసుకోవాలో వారు వివరిస్తున్నారు.
పాల కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె ఉంటాయి. పాలను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఈ విటమిన్లను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో ఆయా విటమిన్ల లోపం లేకుండా ఉంటుంది. నెయ్యి, పాలల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి స్థిరమైన శక్తి లభిస్తుంది. ఈశక్తి వివిధ శరీర విధులు నిర్వర్తించడానికి మద్దతును ఇస్తుంది. నెయ్యి, పాలల్లో విటమిన్ డి తో పాటు క్యాల్షియం కూడా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యి కీళ్లకు సహజ కందెనగా పని చేస్తుంది. కీళ్ల సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యలతో బాధపడే వారు నెయ్యిని, పాలను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో స్రావాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇక వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. తద్వారా శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నిద్రించే ముందు నెయ్యిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమితో బాధపడే వారు నెయ్యిని, పాలను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రారంభ దశలో ఒక గ్లాస్ పాలకు ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవడం మంచిది. అభిరుచికి, సౌకర్యానికి తగినట్టు వీటిని సర్దుబాటు చేసుకోవాలి. అయితే ఈ రెండింటిలో కూడా క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిది. అలాగే వీటిని ఉదయం పూట లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఉదయం పూట తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. కనుక రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. రాత్రిపూట తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. ఈ విధంగా నెయ్యి, పాలను కలిపి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.