Flax Seeds Oil | ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలో అవిసె గింజలు ఎంతో దోహదం చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ గింజలను తరచూ తినాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే అవిసె గింజలు మాత్రమే కాదు, ఈ గింజల నుంచి తయారు చేసే నూనె కూడా మనకు అనేక లాభాలను అందిస్తుంది. దీన్ని కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అవిసె గింజల నూనెను లిన్సీడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని పోషకాలకు గనిగా కూడా చెప్పవచ్చు. అవిసె గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. ఇందులో ఆల్ఫా లినోలియిక్ యాసిడ్ (ఏఎల్ఏ), వృక్ష సంబంధిత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. కనుక అవిసె గింజల నూనెను వంటల్లో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. దీన్ని వాడితే పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు.
అవిసె గింజల నూనెలో ఉండే ఏఎల్ఏ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనంగా పనిచేస్తుంది. బీపీని తగ్గించడంలో సహాయం చేస్తుంది. రక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అవిసె గింజల నూనెను వాడడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనె ఎంతటి తీవ్రమైన వాపులను అయినా సరే తగ్గిస్తుంది. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరం బాహ్యంగా ఉండే వాపులు మాత్రమే కాక, అంతర్గతంగా ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ నూనెలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఎక్కడ వాపులు ఉన్నా సరే తగ్గిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
అవిసె గింజల నూనెలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడును చురుగ్గా మారుస్తాయి. ఈ నూనెలోని ఏఎల్ఏతోపాటు ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఈపీఏ, డీహెచ్ఏ మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మెదడు యాక్టివ్గా మారి చురుగ్గా పనిచేస్తుంది. అవిసె గింజల నూనె సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని వాడితే మలబద్దకం అన్న సమస్య ఉండదు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. పోషకాహార లోపం తగ్గుతుంది.
అవిసె గింజల నూనెలో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల చర్మ వాపులు తగ్గిపోతాయి. చర్మం తేమగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది. అవిసె గింజల నూనె వల్ల చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ నూనెను నేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. కనుక వేడి చేయరాదు. వంటలకు వాడితే కూరల్లో నేరుగా వేయాలి. వేడి చేయకూడదు. ఈ నూనె వేడికి చాలా సున్నితంగా ఉంటుంది. కనుక కూర పూర్తయ్యాక వేసుకోవచ్చు. లేదా ఈ నూనెను నేరుగా తీసుకోవచ్చు. పెద్దలు రోజుకు 1 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజల నూనెను తీసుకోవచ్చు. దీన్ని మీరు రోజూ తాగే స్మూతీలు లేదా ఇతర పానీయాల్లో కలిపి తాగవచ్చు. లేదా సలాడ్స్పై చల్లి తినవచ్చు. ఇలా అవిసె గింజల నూనెను వాడితే అనేక లాభాలను పొందవచ్చు.