Fish Oil Capsules | చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక లాభాలను అందిస్తాయి. చేపల్లో ఈపీఏ, డీహెచ్ఏ అనే రెండు ముఖ్యమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని మన శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. బయటి నుంచి అందించాలి. అయితే ఈ పోషకాలు రెండూ చేపల్లో అధికంగా ఉంటాయి. కనుకనే తరచూ చేపలను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే చేపలను తరచూ తినలేమని భావించే వారు వాటికి చెందిన ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌ను రోజూ వాడవచ్చు. వీటితో కూడా ఈపీఏ, డీహెచ్ఏ పోషకాలను పొందవచ్చు. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను వాడాలని అప్పుడప్పుడు డాక్టర్లు సైతం సూచిస్తుంటారు. వీటిని వాడడం వల్ల కూడా అనేక లాభాలను పొందవచ్చు.
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను వాడడం వల్ల రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ క్యాప్సూల్స్‌ను వాడితే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ క్యాప్సూల్స్ ఎంతో మేలు చేస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా వచ్చే వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ క్యాప్సూల్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్త నాళాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీంతో గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ క్యాప్సూల్స్‌లో ఉండే డీహెచ్ఏ మెదడు కణాలతోపాటు కంటి రెటీనాను రక్షిస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ క్యాప్సూల్స్‌ను తీసుకోవడం వల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నాడులు ఉత్తేజితమవుతాయి. యాక్టివ్‌గా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. బద్దకం పోతుంది. గర్భిణీలు వాడితే శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు రాకుండా నివారించవచ్చు.
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను వాడడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ ఇవి చేపలకు ప్రత్యామ్నాయం కావు. చేపలలో ఈపీఏ, డీహెచ్ఏలు సహజసిద్ధంగా లభిస్తాయి. కనుక వీలైనంత వరకు చేపలను తరచూ తినడమే మంచిది. అలా కుదరని పక్షంలోనే ఈ క్యాప్సూల్స్‌ను వాడాల్సి ఉంటుంది. అది కూడా న్యూట్రిషనిస్టు లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ క్యాప్సూల్స్‌ను వాడాల్సి ఉంటుంది. లేదంటే కొందరిలో ఈ క్యాప్సూల్స్ సైడ్ ఎఫెక్ట్స్‌ను కలిగించే అవకాశం ఉంటుంది. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను నిపుణులు సూచించిన మోతాదులో వాడితే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ క్యాప్సూల్స్‌ను చేపల ఆయిల్ నుంచి తయారు చేస్తారు కనుక వెజిటేరియన్లు వీటిని వాడలేరు. అలాంటి వారికి ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ క్యాప్సూల్స్ లభిస్తాయి. వాటిని కూడా వాడవచ్చు. అవి కూడా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లాగే ఒకేలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. ఇలా ఈ క్యాప్సూల్స్‌తో అనేక లాభాలను పొందవచ్చు.