Fenugreek Leaves | మెంతులను మనం వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నాం. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం మెంతులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. మెంతులు కేవలం రుచి కోసమే కాక ఔషధంగా కూడా పనిచేస్తాయి. మెంతులను నీటిలో నానబెట్టి తినవచ్చు. లేదా మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. అలాగే మెంతి గింజల పేస్ట్‌ను తలకు లేదా ముఖానికి ఉపయోగిస్తారు. ఇక కేవలం మెంతులు మాత్రమే కాదు, మెంతి ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మెంతి ఆకులను కొందరు కూరల్లో వేస్తుంటారు. దీంతో కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే మెంతి ఆకులను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ ఆకులతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేందుకు దోహదం చేస్తుంది. తీవ్రమైన మలబద్దకం ఉన్నా సరే రోజూ మెంతి ఆకులను ఉడకబెట్టి తింటుంటే తగ్గిపోతుంది. మెంతి ఆకులను తింటే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. మెంతి ఆకుల్లో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలను మెంతి ఆకులు తగ్గిస్తాయి. ఈ ఆకులను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మెంతి ఆకుల జ్యూస్‌ను ఉదయం తాగుతుంటే కొవ్వును కరిగించుకోవచ్చు. దీంతో బరువు కూడా తగ్గుతారు.
మెంతులను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే మెంతులు చాలా చేదుగా ఉంటాయి. కనుక వీటిని అందరూ తినలేరు. అలాంటి వారు మెంతి ఆకులను తినవచ్చు. ఇవి కూడా చేదుగానే ఉంటాయి. కానీ మెంతులతో పోలిస్తే వాటి ఆకులు కాస్త తక్కువ చేదుగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తినవచ్చు. వీటిని రసం తీసి తాగవచ్చు. లేదా కూరగా అయినా వండుకుని తరచూ తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి మెంతి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను తినడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. మెంతి ఆకులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
మెంతి ఆకుల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు తరచూ మెంతి ఆకులను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. మెంతి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని సైతం మెరుగు పరుస్తాయి. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం నుంచి బయట పడవచ్చు. ఇలా మెంతి ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో రోజూ ఉడకబెట్టి తినాలి. లేదా రసం అయినా తాగవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.