Pineapple | పైనాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. బయటకు వెళ్తే చాలా మంది పైనాపిల్ పండ్ల జ్యూస్‌ను తాగుతుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా జ్యూస్‌లను తాగడం అంత మంచిది కాదు. నేరుగా పండ్లనే తినాలి. పైనాపిల్ పండ్లు తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. కనుకనే మనం పైనాపిల్ పండ్లను తిన్నప్పుడు నాలుక మండుతుంది. అయితే ఇలా జరుగుతుందని చెప్పి చాలా మంది పైనాపిల్ పండ్లను తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. కానీ జ్యూస్‌ను మాత్రం తాగుతారు. అయితే పైనాపిల్ పండును అడ్డంగా ముక్కలుగా కట్ చేసి వాటిపై కాస్త ఉప్పు చల్లి తినాలి. దీంతో ఆ పండులో ఉండే బ్రొమెలెయిన్ శక్తి తగ్గుతుంది. దీంతో నాలుక మండదు. ఇలా పైనాపిల్‌ను రోజూ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పైనాపిల్ పండ్లలో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయం చేస్తాయి. కొల్లాజెన్ మన చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం సాగే గుణాన్ని పొందేలా చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే డ్యామేజ్ తగ్గుతుంది. దీంతో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను ఇది విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
పైనాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల మన శరీరంలో ఏర్పడే వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే సైనస్ నుంచి విముక్తి లభిస్తుంది. గాయాలు త్వరగా మానుతాయి. శరీరంలో నీరు అధికంగా ఉన్నవారు పైనాపిల్ పండ్లను తింటుంటే సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లు సహజసిద్ధమైన డైయురెటిక్‌గా పనిచేస్తాయి. దీంతో శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఉత్సాహంగా ఉంటారు. పైనాపిల్ పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పైనాపిల్ పండ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి బీపీని తగ్గిస్తుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. పైనాపిల్ పండ్లలో మాంగనీస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో ఎముకలు త్వరగా విరిగిపోయే స్వభావం నుంచి బయట పడతాయి. ఇలా పైనాపిల్ పండ్లను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.