Sesame Seeds Laddu | సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది అనేక రకాల తినుబండారాలు లేదా నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే అలాంటివి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందువల్ల మనం తినే స్నాక్స్ కూడా ఆరోగ్యవంతమైవని అయి ఉండాలి. పూర్వ కాలంలో మన వాళ్లు అనేక రకాల తినుబండారాలను చేసి తినేవారు. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. వీటినే నువ్వుల ఉండలు అని కూడా అంటారు. ఆధునీకరణ పుణ్యమా అని ఇలాంటి తినుబండారాలను చాలా మంది తినడం మానేశారు. కానీ ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాదు, శక్తిని, పోషణను కూడా ఇస్తాయి. ఈ క్రమంలోనే రోజుకు ఒక నువ్వుల లడ్డూను తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు.
నువ్వుల లడ్డూలను పోషకాలకు గనిగా చెబుతారు. ఈ లడ్డూలలో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు బి1, బి3, బి6, ఫోలేట్ సైతం ఈ లడ్డూల్లో అధికంగా ఉంటాయి. నువ్వుల లడ్డూల్లో వాడే ప్రధాన పదార్థాల్లో ఒకటి బెల్లం. ఇది సహజసిద్ధమైన తీపి పదార్థంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కొన్ని రకాల బి విటమిన్లు ఉంటాయి. బెల్లాన్ని చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. అందువల్ల బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డూలను తింటే అనేక పోషకాలను పొందవచ్చు. ఇవి మనకు రోగాలు రాకుండా చూస్తాయి. శక్తిని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కఫం కరిగిపోతుంది.
నువ్వుల్లో ఉండే బెల్లం కారణంగా ఇందులో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు మన శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి. నువ్వుల లడ్డూను ఒకటి తింటే చాలు అలసిన శరీరం తక్షణమే శక్తిని పొందుతుంది. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారు ఒక్క లడ్డూను తింటే త్వరగా శక్తి లభిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. మళ్లీ పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. అలాగే నీరసం, అలసట తగ్గిపోతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నువ్వులలో క్యాల్షియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. విరిగిన ఎముకలు ఉన్నవారు రోజుకు ఒక నువ్వుల లడ్డూను తింటే త్వరగా కోలుకుంటారు. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి.
నువ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు వీటిల్లో అధికంగా ఉంటాయి. ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా నువ్వుల్లో ఉంటాయి. అందువల్ల నువ్వులతో తయారు చేసిన లడ్డూలను తింటే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. నువ్వుల లడ్డూలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా నువ్వుల లడ్డూలను పిల్లలు, పెద్దలు రోజుకు ఒకటి తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.