Buttermilk | సాధారణంగా చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. కానీ మజ్జిగను మాత్రం తీసుకోరు. అందులో నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పి మజ్జిగను సేవించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే పెరుగు కన్నా మజ్జిగనే ఎక్కువ ఆరోగ్యకరమైందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలోని వేడిని తగ్గించేందుకు రెండూ ఉపయోగకరమైనవే. కానీ మజ్జిగలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఇది మనకు ఇంకా ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు. ఇక వేసవి కాలంలో రోజూ ఒక గ్లాస్ మజ్జిగను మధ్యాహ్నం సమయంలో తాగితే ఎంతో మేలు జరుగుతుంది. మజ్జిగ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మజ్జిగను రోజూ సేవించడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి.
మజ్జిగ ప్రొ బయోటిక్ ఆహారాల జాబితాకు చెందినది. అందువల్ల మజ్జిగను రోజూ తాగితే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. మజ్జిగలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల మజ్జిగను రోజూ సేవిస్తే ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది.
అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి మజ్జిగ మంచి ఆహారం అని చెప్పవచ్చు. మజ్జిగలో ప్రోటీన్లు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటాయి. పెరుగుతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. దీన్ని తాగితే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీంతో ఆహార్ తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. మజ్జిగను తాగడం వల్ల వేసవిలో శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందవచ్చు. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
మజ్జిగలో అనేక ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు మజ్జిగను సేవిస్తుంటే ప్రయోజనం ఉంటుంది. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. మజ్జిగలో ఉండే రైబోఫ్లేవిన్ లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో లివర్‌లో ఉండు వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు రోజూ మజ్జిగను సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. చర్మ సంరక్షణకు కూడా మజ్జిగ మేలు చేస్తుంది. మజ్జిగను సేవిస్తుంటే డ్యామేజ్ అయిన చర్మ కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఇలా మజ్జిగను రోజూ సేవిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.