Walnuts | మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలను తినాలని చాలా మంది సందేహిస్తుంటారు. పోషకాలు వేటిల్లో ఎక్కువగా ఉంటాయి అని వెదుకుతుంటారు. అయితే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో వాల్ నట్స్ ఒకటి. వీటిని రోజువారి ఆహరంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాల్ నట్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఈ నట్స్‌లో అధికంగా ఉంటాయి. అందువల్ల వాల్ నట్స్‌ను కనీసం రోజుకు 3 తిన్నా చాలు, మనకు పోషణ లభిస్తుంది. వాల్ నట్స్‌ను రోజూ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. వాల్ నట్స్‌లో డీహెచ్ఏ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. రోజూ ఈ నట్స్‌ను తినడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారి ఉత్సాహంగా ఉంటుంది. చిన్నారులు అయితే చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి.
వాల్ నట్స్‌ను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. అధిక బరువు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. అధికంగా బరువు ఉన్నవారు, బరువు తగ్గాలని చూస్తున్నవారు కచ్చితంగా వాల్ నట్స్‌ను రోజూ తింటే ప్రయోజనం పొందవచ్చు. వాల్ నట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో రోజూ సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. వాల్ నట్స్‌ను తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
వాల్ నట్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల షుగర్ ఉన్నవారు ఈ నట్స్‌ను నిర్భయంగా తినవచ్చు. వీటిని తింటే ఇన్సులిన్ గ్రాహక శక్తి పెరుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి వాల్ నట్స్ గొప్ప వరమనే చెప్పవచ్చు. రోజూ వీటిని తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. వాల్ నట్స్‌లో మెగ్నిషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్ నట్స్‌ను తరచూ తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. కనుక ఎముకలు బలహీనంగా ఉన్నవారు వాల్ నట్స్‌ను రోజూ తినాలి. ఇలా వాల్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. సాయంత్రం సమయంలో చిరుతిళ్లకు బదులుగా వీటిని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి.