Hibiscus Flowers Tea | చాలా మంది రోజూ కప్పుల కొద్ది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. టీ, కాఫీలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని సేవిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. కనుకనే చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే టీ, కాఫీలను అధికంగా తాగడం అంత మంచిది కాదు. మన శరీరంలోకి కెఫీన్ ఎక్కువగా చేరితే నష్టాన్ని కలగజేస్తుంది. ఇది గ్యాస్ ట్రబుల్‌తోపాటు నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది. కెఫీన్ మన శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. మోతాదుకు మించి శరీరంలో కెఫీన్ ఉండడం మంచిది కాదు. అయితే టీ, కాఫీలను కచ్చితంగా తాగాలి అనుకునేవారు.. వాటికి బదులుగా హెర్బల్ టీలను సేవించవచ్చు. వీటిల్లో కెఫీన్ ఉండదు. పైగా వీటిని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
హెర్బల్ టీల విషయానికి వస్తే మందార పువ్వుల టీ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఒంటి రెక్క మందార పువ్వులతో తయారు చేసే ఈ టీని సేవిస్తే అనేక లాభాలు కలుగుతాయి. మందార పువ్వులను ఎండబెట్టి తయారు చేసిన టీ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని ఉపయోగించి మందార పువ్వుల టీ తయారు చేసి తాగవచ్చు. అందులో రుచి కోసం నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ క్రమంలోనే మందార పువ్వుల టీని సేవిస్తే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. శరీరంలోని వాపులు తగ్గుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
మందార పువ్వుల టీ హైబీపీ ఉన్నవారికి ఒక వరమనే చెప్పవచ్చు. దీన్ని సేవిస్తుంటే బీపీ తగ్గుతుంది. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. హైబీపీ ఉన్నవారు తరచూ మందార పువ్వుల టీని సేవిస్తుంటే బీపీని తగ్గించుకుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మందార పువ్వుల టీని సేవిస్తుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలో ఎల్డీఎల్ తగ్గి హెచ్‌డీఎల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. మందార పువ్వుల టీని సేవిస్తుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ ఈ టీని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.
మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌ను డిటాక్సిఫై చేస్తాయి. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. మందార పువ్వుల టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి తగ్గుతాయి. ఈ టీలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి పేగుల్లో మలం సులభంగా కదిలేలా చేస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మందార పువ్వుల టీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ టీలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇలా మందార పువ్వుల టీని సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.