Anjeer Fruits | మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడమే చాలా కష్టం. చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారాలు అనగానే అసలు ఏం తినాలో అంతగా తెలియదు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాల విషయానికి వస్తే అంజీర్ పండ్లు మొదటి స్థానంలో నిలుస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పండ్లు అందించే ఆరోగ్య ప్రయోజనాలు అలా ఉంటాయి మరి. అంజీర్ పండ్లు మనకు మార్కెట్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. ఇవి చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. ఈ పండ్ల నిర్మాణం పురుగులను పోలి ఉంటుంది. కనుక అంజీర్ పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. కానీ ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంజీర్ పండ్లను రోజూ నానబెట్టి తింటే అనేక లాభాలను పొందవచ్చు.
అంజీర్ పండ్లనే అత్తిపండ్లుగా పిలుస్తారు. ఇవి మామూలు పండ్లుగా కూడా మనకు లభిస్తుంటాయి. కానీ డ్రై ఫ్రూట్స్గానే చాలా మంది వీటిని చూసి ఉంటారు. ఇక అంజీర్ పండ్లు మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఎండిన అంజీర్ పండ్లను ఎక్కువ సేపు నమిలితో నోట్లో లాలాజలం తయారవుతుంది. దాన్ని మింగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండే ఇందులో ఎక్కువగా ఫైబర్, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీర్‌ను మరుసటి రోజు ఉదయం తేనెతో కలిపి పరగడుపున తింటే మెరుగైన జీర్ణశక్తి సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అంజీర్ పండ్లలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే మంచిది. ముఖ్యంగా మెనోపాజ్ లోకి అడుగు పెడుతున్నప్పుడు మహిళలు ప్రతి రోజూ వీటిని తీసుకోవాలి. అలాగే ఈ పండ్లలోని ఫైబర్ మలినాలను బయటకు పంపుతుంది. ఈ పండ్ల ద్వారా అతి తక్కువ క్యాలరీలు శరీరానికి లభిస్తాయి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఆకలిగా అనిపిస్తే అంజీర్ పండ్లను తినవచ్చు. దీంతో బరువు కూడా తగ్గుతారు. భోజనం తరువాత స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ వంటివి తినే అలవాటు ఉన్నవారు వాటి స్థానంలో అంజీర్ పండ్లను తినవచ్చు.
అంజీర్‌లోని క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. షుగర్ ఉన్నవారు, చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలని అనుకునేవారు అంజీర్ పండ్లను తింటే మంచిది. జింక్, మాంగనీస్, ఐరన్ తదితర మినరల్స్ కూడా ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలను తగ్గిస్తాయి. రక్తం అధికంగా తయారు అయ్యేలా చేస్తాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది. అంజీర్ పండ్లను తరచూ తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా సైతం పెరుగుతుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా అంజీర్ పండ్లను తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.