Black Raisins | కిస్మిస్లు.. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. ద్రాక్షలను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. కిస్మిస్లను ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే కిస్మిస్లలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో నలుపు రంగు కిస్మిస్లు కూడా ఒకటి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నలుపు రంగు కిస్మిస్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు పొందవచ్చు. ఈ కిస్మిస్లను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 300 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 80 గ్రాములు, ఫైబర్ 7 గ్రాములు, ప్రోటీన్లు 3 గ్రాములు లభిస్తాయి. కొవ్వులు అసలే ఉండవు. విటమిన్లు బి1, బి2, బి3, బి6, బి9లతోపాటు విటమిన్ సి అధికంగా లభిస్తుంది. అలాగే ఈ కిస్మిస్లలో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, బోరాన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ కిస్మిస్లను తింటే పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు.
నలుపు రంగు కిస్మిస్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ కిస్మిస్లను తింటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. హిమోగ్లోబిన్ తయారవుతుంది. ఈ కిస్మిస్లలో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్‌ను మరింత మెరుగ్గా శోషించుకుంటుంది. అలాగే కాపర్ కూడా లభిస్తుంది. దీంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. నీరసం, అలసట తగ్గుతాయి. నలుపు రంగు కిస్మిస్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సార్బిటాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది లాక్సేటివ్గా పనిచేస్తుంది. అందువల్ల ఈ కిస్మిస్లను తింటే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.
నలుపు రంగు కిస్మిస్లలో క్యాల్షియం, బోరాన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం మరింత మెరుగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు బలంగా తయారవుతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. మెనోపాజ్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. నలుపు రంగు కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే ఈ కిస్మిస్లలో ఉండే రెస్వెరెట్రాల్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
నలుపు రంగు కిస్మిస్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని తింటే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఈ కిస్మిస్లలో ఉండే పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్ ఆక్సీకరణ ఒత్తిడిని, శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. దీంతో తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. ఈ కిస్మిస్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ఇలా నలుపు రంగు కిస్మిస్లను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ నీటిలో నానబెట్టి తింటే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.