Flax Seeds | పూర్వకాలంలో మన పెద్దలు అనేక రకాల ఆహారాలను తినేవారు. వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. ఇవి శరీరానికి ఎంతో బలాన్నిస్తాయి. మన పెద్దలు ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు. కనుక వారికి ఈ గింజలు అమితమైన బలాన్ని ఇచ్చేవి. పైగా ఈ గింజలను తింటే పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. కానీ నేటి తరుణంలో మనం ఈ గింజలను తినడమే మానేశాం. వాస్తవానికి అవిసె గింజలు మనకు లభించిన అమృత ప్రసాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో పోషకాలు ఈ గింజల్లో ఉంటాయి. అవిసె గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల మేర అవిసె గింజలను తింటున్నా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
1 టేబుల్ స్పూన్ లేదా 15 గ్రాముల అవిసె గింజలను తింటే సుమారుగా 76 క్యాలరీల శక్తి లభిస్తుంది. 4 గ్రాముల ప్రోటీన్లు, 6 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 9 గ్రాముల పిండి పదార్థాలు, 3.3 గ్రాముల ఫైబర్, 0.2 మిల్లీగ్రాముల విటమిన్ బి1, 0.2 మిల్లీగ్రాముల కాపర్, 57 మిల్లీగ్రాముల మెగ్నిషఙయం, 1.1 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తాయి. అందువల్ల అవిసె గింజలను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల రక్త నాళాలు వాపులకు గురికాకుండా చూసుకోవచ్చు. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. రక్త నాళాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
అవిసె గింజలను తినడం వల్ల రక్తనాళాలు క్లియర్ అయి బీపీ నియంత్రించబడుతుంది. అందువల్ల హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. రోజూ 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను తింటుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ గింజలను తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అవిసె గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు.
అవిసె గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు చురుగ్గా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. దీని వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చేపలను తినలేని వారికి అవిసె గింజలు ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. చేపల్లో ఉండే పోషకాలన్నీ దాదాపుగా ఈ గింజల్లోనూ ఉంటాయి. కనుక చేపలను తినడం లేదని బాధపడేవారు వాటిల్లోని పోషకాలు అందాలంటే అవిసె గింజలను తింటుంటే చాలు, అనేక పోషకాలను పొందవచ్చు. ఈ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో ఎల్డీఎల్ తగ్గి హెచ్‌డీఎల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అవిసె గింజలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.