Cloves Milk | లవంగాలను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటిని ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. నాన్ వెజ్ వంటకాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. లవంగాలు ఘాటుగా ఉంటాయి కనుక కూరలు కారంగా ఉండాలని కోరుకునే వారు లవంగాలను ఎక్కువగా వాడుతుంటారు. అయితే లవంగాలను నేరుగా కూడా తింటుంటారు. లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే అనేక లాభాలు కలుగుతాయి. కానీ ఘాటుగా ఉంటాయి కనుక కొందరు నేరుగా తినలేకపోతుంటారు. అలాంటి వారు లవంగాలను పాలలో వేసి మరిగించి తాగవచ్చు. ఈ మిశ్రమం అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఎంతోకాలంగా ఈ మిశ్రమాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలలో లవంగాలను వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు.
పాలలో లవంగాలను వేసి మరిగించి తాగితే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం మన శరీరానికి అందుతుంది. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల లవంగాలు, పాల మిశ్రమం రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. లవంగాలు మన శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. అందువల్ల ఈ పాలను తాగితే రాత్రిపూట శరీరం వెచ్చగా ఉంటుంది. చల్లని వాతావరణంలో మేలు జరుగుతుంది. అలాగే గొంతు సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. బ్రాంకైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల వాపులు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి.
లవంగాలు, పాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయంలో పలు ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. దీని వల్ల ఒళ్లు నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. లవంగాల పాలను తాగడం వల్ల నిద్రలేమి తగ్గుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
లవంగాల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. లవంగాల పాలను తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వల్ల లివర్ వాపులకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ కణాలు రక్షించబడతాయి. లవంగాల పాలను రాత్రి పూట నిద్రకు ముందు తాగితే మేలు జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత కూడా ఈ పాలను తాగవచ్చు. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పొట్టలో తరచూ అసౌకర్యం ఏర్పడే వారు, అలర్జీలు ఉన్నవారు ఈ పాలను తాగకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ ఈ పాలను సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.