Cauliflower | బయట రెస్టారెంట్లకు వెళ్లినా లేదా ఫాస్ట్ ఫుడ్ బండ్ల వద్దకు వెళ్లినా మనకు గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ 65 లాంటి కాలిఫ్లవర్ వంటకాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు కూడా. అయితే వాస్తవానికి కాలిఫ్లవర్‌ను ఇలా తినకూడదు. ఈ వంటకాలు మనకు హాని చేస్తాయి. కాలిఫ్లవర్‌ను కూరగా వండుకుని లేదా సూప్‌గా చేసుకుని తినాలి. అయితే కాలిఫ్లవర్‌ను ఇలా తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ కాలిఫ్లవర్‌తో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే దీన్ని విడిచిపెట్టకుండా తింటారు. కాలిఫ్లవర్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం తొలగిపోతుంది. అలాగే పలు వ్యాధుల నుంచి కూడా బయట పడవచ్చు. కాలిఫ్లవర్‌ను తరచూ తినడం వల్ల ఏం జరుగుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు ఉడకబెట్టిన కాలిఫ్లవర్‌ను తింటే సుమారుగా 27 క్యాలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 5 గ్రాములు, ఫైబర్ 2.50 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు, కొవ్వు 0.1 గ్రాములు, విటమిన్లు సి, కె, బి9, బి6, బి5, ఎ, పొటాషియం, మాంగనీస్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్, జింక్, కాపర్, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా మనకు కాలిఫ్లవర్ ద్వారా లభిస్తాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను పొందవచ్చు. కాలిఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని తరచూ తింటుంటే గ్లూకోసైనోలేట్స్, ఐసోథయోసయనేట్స్, సల్ఫోరాఫేన్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
కాలిఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరరీం సరిగ్గా శోషించుకుంటుంది. కాలిఫ్లవర్‌ను తినడం వల్ల మన శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. పైగా ఇందులో ఉండే ఫైబర్ వల్ల దీన్ని తింటే ఎక్కువ సేపు అయినా కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు కాలిఫ్లవర్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
కాలిఫ్లవర్‌లో కోలిన్ అధికంగా ఉంటుంది. ఇది మెదడు కణాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. అందువల్ల కాలిఫ్లవర్‌ను తింటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా కాలిఫ్లవర్ ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. కాలిఫ్లవర్‌లో వృక్ష సంబంధ సమ్మేళనాలు, విటమిన్లు, మినరల్స్ అనేకం ఉంటాయి. ఇవి మన శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించేందుకు సహాయం చేస్తాయి. కనుక కాలిఫ్లవర్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.