Cauliflower | మార్కెట్‌కు వెళితే మనకు అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీని నుంచి వచ్చే వాసన కారణంగా చాలా మంది కాలిఫ్లవర్‌ను తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ బయట ఫాస్ట్ ఫుడ్ బండ్లపై చేసే గోబీ మంచూరియా వంటి వాటిని మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు. అయితే వాస్తవానికి కాలిఫ్లవర్ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని మనం అనేక రకాలుగా తినవచ్చు. కాస్త ఉడకబెట్టి పచ్చి కూరగాయలతో కలిపి సలాడ్‌లా తినవచ్చు. పెనంపై కాస్త నెయ్యి వేసి కాలిఫ్లవర్‌ను రోస్ట్ చేసి తింటే రుచి అదిరిపోతుంది. అలాగే కూరల రూపంలోనూ తినవచ్చు. సూప్‌లు, ఇతర వంటకాలు కూడా చేసి తినవచ్చు. ఇలా కాలిఫ్లవర్‌ను ఏ రూపంలో తిన్నా కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయి. పలు పోషకాలను కూడా పొందవచ్చు.
కాలిఫ్లవర్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి కి దీన్ని మంచి మూలంగా చెబుతుంటారు. ఒక కప్పు కాలిఫ్లవర్ ముక్కలను ఉడకబెట్టి తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సి మొత్తం లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం తన సహజ సిద్ధమైన సాగే గుణాన్ని పొందుతుంది. దీని వల్ల యవ్వనంగా మారుతారు. కాంతివంతంగా కనిపిస్తారు. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. కాలిఫ్లవర్‌లో ఉండే విటమిన్ కె ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా చూసుకోవచ్చు.
కాలిఫ్లవర్‌లో ఫోలేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. కనుక గర్భిణీలు కాలిఫ్లవర్‌ను తింటుంటే శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పిల్లలకు పుట్టుకతో లోపాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాలిఫ్లవర్‌లో విటమిన్లు బి1, బి3, బి6 కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు, శక్తికి, వ్యాధులను నయం చేయడానికి పనిచేస్తాయి. కాలిఫ్లవర్‌లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. కాలిఫ్లవర్‌లో అధికంగా ఉండే మాంగనీస్ మెటబాలిజం ప్రక్రియ సరిగ్గా ఉండేలా చేస్తుంది. అలాగే మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ కూడా కాలిఫ్లవర్‌లో అధికంగా ఉంటాయి.
కాలిఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల కాలిఫ్లవర్‌ను తింటే శరీరానికి నష్టం చేసే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కాలిఫ్లవర్‌లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. తరచూ దీన్ని తింటుంటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. కాలిఫ్లవర్‌ను తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ కాలిఫ్లవర్‌తో సూప్‌ను తయారు చేసి తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇలా కాలిఫ్లవర్ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.