Broccoli | బ్రోకలీ.. చూసేందుకు ఇది అచ్చం కాలిఫ్లవర్లా ఉంటుంది. కాలిఫ్లవర్ పువ్వు తెలుపు రంగులో ఉంటుంది. కానీ బ్రోకలీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇవి ఒకే వర్గానికి చెందిన కూరగాయలు. ఇక కాలిఫ్లవర్ కన్నా బ్రోకలీ కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమనే చెప్పాలి. బ్రోకలీ మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దీన్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు. అలా చేస్తే పోషకాలు పోతాయి. పెనంసై కాస్త నెయ్యి వేసి బ్రోకలీ ముక్కలను వేసి కాస్త వేయించాలి. అంతే.. కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లి తినేయడమే. అయితే ఆకుపచ్చ రంగులో ఉంటాయి కనుక వీటిని అలా తినేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ ఒక్కసారి తింటే వీటి రుచిని అసలు మరిచిపోరు. ఇవి రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తాయి. బ్రోకలీని తరచూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక దీన్ని తరచూ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు. బ్రోకలీలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది. బీపీ ఉన్నవారు తరచూ బ్రోకలీని తింటే ఎంతో మేలు జరుగుతుంది. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు వెళ్లే రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
బ్రోకలీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి బయట పడవచ్చు. బ్రోకలీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. బ్రోకలీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్రోకలీలో ఉండే విటమిన్ కె కూడా ఎముకలను సురక్షితంగా ఉంచుతుంది. అలాగే శరీర మెటబాలిజం సక్రమంగా ఉండేలా చేస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తరచూ బ్రోకలీని ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. బ్రోకలీలో ఉండే సల్ఫరోఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ నుంచి రక్షణను అందిస్తుంది. బ్రోకలీలో లుటీన్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి కళ్లను సురక్షితంగా ఉంచుతాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి. బ్రోకలీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ చర్మాన్ని ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ఇలా బ్రోకలీని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.