Bottle Gourd Juice | కొన్ని రకాల కూరగాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కానీ కొన్ని కూరగాయలను తినేందుకు మాత్రం అంతగా ఇష్టం చూపరు. అలాంటి కూరగాయల్లో ఆనపకాయ కూడా ఒకటి. దీన్నే సొరకాయ అని కూడా పిలుస్తారు. ఆనపకాయతో పచ్చడి, పప్పు, కూర వంటివి చేస్తారు. కానీ కూర చప్పగా ఉంటుందని చెప్పి చాలా మంది తినరు. అయితే ఆనపకాయలను కూరగా తినలేకపోతే కనీసం జ్యూస్‌లా తయారు చేసి అయినా సరే రోజూ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆనపకాయల జ్యూస్‌ను తాగితే అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి అనేక పోషకాలు కూడా లభిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ మోతాదులో ఆనపకాయ జ్యూస్‌ను తాగాలని సూచిస్తున్నారు.
ఆనపకాయల్లో 92 శాతం నీరే ఉంటుంది. కనుక వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ను తాగుతుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వేడి తగ్గి చల్లగా మారుతుంది. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఆనపకాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ కాయలతో జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగుతుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువును తగ్గించేందుకు సహాయం చేస్తుంది.
ఆనపకాయల్లో విటమిన్లు సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, కె అధికంగా ఉంటాయి. క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్ కూడా అధికంగానే ఉంటాయి. ఫైబర్ ఈ కాయల్లో పుష్కలంగా ఉంటుంది. ఆనపకాయల జ్యూస్‌ను తాగుతుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఆనపకాయల్లో డైయురెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ కాయలతో జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగుతుంటే శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. రోగాలు రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ఆనపకాయల్లో ఉండే ఫైబర్, పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి ఆనపకాయల జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజూ ఈ జ్యూస్‌ను తాగుతుంటే షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు ఆనపకాయ జ్యూస్‌ను సేవిస్తే మంచిది. మైండ్ రిలాక్స్ అయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. ఉత్సాహంగా ఉంటారు. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ ఈ జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. లివర్‌లోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా ఆనపకాయ జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.