Black Rice | ఆసియా దేశాలకు చెందిన వారికి ప్రధాన ఆహారం.. బియ్యం. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన ప్రజలు బియ్యాన్ని తింటున్నారు. బియ్యంతో అనేక రకాల వంటకాలను చేసి తింటారు. దక్షిణ భారతీయులకు అన్నమే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో బ్రౌన్ రైస్ కూడా ఒకటి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్న చాలా మంది ప్రస్తుతం బ్రౌన్ రైస్‌ను తింటున్నారు. కానీ బ్లాక్ రైస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. సాధారణ బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్‌లో అనేక పోషకాలు ఉంటాయి. బ్లాక్ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ రైస్‌లో అనేక బి విటమిన్లు ఉంటాయి. రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ ఈ రైస్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీర నిర్మాణానికి దోహదం చేస్తాయి. మెదడు వృద్ధి చెందడానికి సహాయ పడతాయి. బ్లాక్ రైస్‌లో విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. బ్లాక్ రైస్‌లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. ఈ రైస్‌లో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కణాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
బ్లాక్ రైస్‌లో క్యాల్షియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నిషియం, మాంగనీస్, పొటాషియం, ఐరరన్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తం వృద్ధి చెందేలా చేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కణాలకు ఆక్సిజన్ రవాణాను మెరుగు పరుస్తాయి. దీంతో నీరసం, అలసట ఉండవు. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఎంత పనిచేసినా యాక్టివ్గానే ఉంటారు. అలసట, నీరసం రావు. బ్లాక్ రైస్‌లో మన శరీరానికి అవసరం అయ్యే 9 రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి కండరాలకు కావల్సిన శక్తిని అందించడంతోపాటు కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఒక కప్పు బ్లాక్ రైస్‌ను తింటే 173 క్యాలరీల శక్తి లభిస్తుంది. 38 గ్రాముల పిండి పదార్థాలు, 5 గ్రాముల ప్రోటీన్లు, 3 గ్రాముల ఫైబర్, 1 గ్రాము చక్కెర లభిస్తాయి.
బ్లాక్ రైస్‌లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ రైస్‌ను నిరభ్యంతరంగా తినవచ్చు. పైగా ఈ రైస్‌లో ఉండే మినరల్స్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. బ్లాక్ రైస్‌ను డయాబెటిస్ పేషెంట్లు తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ రైస్‌ను తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా బ్లాక్ రైస్‌ను రోజూ తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.