Black Eyed Peas | సాయంత్రం సమయంలో చల్లని వాతావరణంలో వేడిగా గారెలను వేసి తింటే వచ్చే మజాయే వేరు. అయితే గారెలను తయారు చేసేందుకు చాలా మంది వాడే పప్పుల్లో బొబ్బర పప్పు కూడా ఒకటి. బొబ్బర్లతో గారెలు వేసి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే వీటిని కేవలం గారెలు వేసేందుకు మాత్రమే ఉపయోగించకూడదు. రోజూ తినాలి. రోజూ ఒక కప్పు బొబ్బర్లను నానబెట్టి వాటిని ఉడికించి తింటే అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు బొబ్బర్లలో ఉంటాయి. బొబ్బర్లను రోజూ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 1 కప్పు బొబ్బర్లను తినడం వల్ల 194 క్యాలరీల శక్తి లభిస్తుంది. అయితే ఈ శక్తి అంతా వాటిల్లో ఉండే ప్రోటీన్ల ద్వారా వచ్చినదే. కనుక ఎలాంటి భయం అవసరం లేదు. ఈ పప్పును తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే విటమిన్ బి9, విటమిన్లు ఎ, కె, బి1, మాంగనీస్, కాపర్, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, సెలీనియం కూడా ఈ గింజల్లో సమృద్ధిగా లభిస్తాయి.
బొబ్బర్లను తినడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సైతం తగ్గిపోతాయి. ఇతర రకాల పప్పు దినుసులను తింటే గ్యాస్ వస్తుంది. కానీ బొబ్బర్లతో గ్యాస్ ఏర్పడదు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను ఉడకబెట్టి తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు లేదా బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు రోజూ బొబ్బర్లను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
బొబ్బర్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. బొబ్బర్లలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు ఈ పప్పును తింటే ఎంతో మేలు జరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. షుగర్ ఉన్నవారికి కూడా ఈ పప్పు మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఈ పప్పు గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ గింజలను తింటే షుగర్ లెవల్స్ అంతగా పెరగవు. పైగా ఈ పప్పులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సైతం నిరభ్యంతరంగా ఈ గింజలను తినవచ్చు. దీంతో షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
బొబ్బర్లలో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుంది. గర్భంలో శిశువు ఎదుగుదలకు సహాయ పడుతుంది. గర్భిణీలకు ఫోలేట్ సరిగ్గా లభిస్తే పుట్టే పిల్లల్లో పోషకాలు, ఎదుగుదల లోపాలు రాకుండా అడ్డుకోవచ్చు. బొబ్బర్లలో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతోపాటు అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. ఇలా బొబ్బర్లను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ వీటిని ఉడికించి తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.